సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని స్పష్టం చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు అనుకూలమైనా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు.
అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో తమపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు మోదీ, అమిత్ షా ద్వయం ప్రయత్నిస్తోందని అందుకోసమే 400 ఎంపీ సీట్లను బీజేపీ అడుగుతోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మోహన్ భగవత్ స్పందిస్తూ, ఆరెస్సెస్ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఓ వీడియోను కొందరు సర్క్యూలేట్ చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తమని తోసిపుచ్చారు. ఎవరికోసం అయితే రిజర్వేషన్లు కేటాయించారో వారు అభివృద్ధి చెందేవరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అన్నారు. రాజ్యాంగం ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు తామెన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు.