హైదరాబాద్ – రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులు నేడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంభిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియచేసారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.. పారిశ్రామిక అభివృద్దిపైనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందనే విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు.