హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను డీఎస్సీ (డిస్టిక్ సెలకక్షన్ కమిటీ) ద్వారా చేపడతారా? లేక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు అప్పగిస్తారా.. అనే దానిపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన స్పష్టతనిచ్చారు. పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలను సైఫాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో శుక్రవారం విడుదల చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… టీఎస్పీఎస్సీ ద్వారానే రాష్ట్రంలోని టీచర్ పోస్టుల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో పలుమార్లు సమావేశమైనట్లు ఆమె స్పష్టం చేశారు.
ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 317 జీవో అమలు కారణంగా నూతన జిల్లాలకు ఉపాధ్యాయులు కేటాయించడంతో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దానిపై వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని, ఖాళీలపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ పాటశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు ఉపాధ్యాయులను వర్క్‌అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా ఉండేందుకు ప్రస్తుతం జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
ప్రతి నెలా పీటీఎంలు…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి నెలా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం)లను ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ మీటింగ్‌లకు తప్పకుండా హాజరుకావాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత పుస్తకాలు అందజేసినట్లు ఆమె చెప్పారు. విద్యార్థులకు ఒక జత స్కూల్ యూనిఫామ్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. మరో జత బట్టలను త్వరలోనే అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు 2.5 లక్షల అడ్మిషన్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం బోధనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ఆమె తెలిపారు.