Thursday, November 7, 2024

TS: యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీల మరమ్మతులు.. మంత్రి ఉత్త‌మ్

ఎన్‌డీఎస్‌ రిపోర్టు ఆధారంగా పనులు
ఈ సీజన్‌కు నీరందించేలా కృషి
తమ్మిడిహెట్టి తప్పకుండా నిర్మిస్తాం..
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల వద్ద మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల బ్యారేజీ వద్ద మరమ్మతు పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

అనంతరం మాట్లాడుతూ… గత ప్రభుత్వం నాసిరకంగా నిర్మించడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ప్రాజెక్టు మరమ్మతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులకు ప్రాజెక్టును సందర్శించి ఎంత మేర డ్యామేజీ జరిగిందో పరిశీలించి ప్రాజెక్టు రక్షణ కోసం చేపట్టాల్సిన పనులపై రిపోర్టు ఇవ్వాలని కోరామన్నారు.

ఎన్‌డీఎస్‌ అధికారులు ప్రాజెక్టును పరిశీలించి ఇంటీరియం రిపోర్టు అందజేశారన్నారు. వారి సూచన మేరకు 3 ఏజెన్సీలకు పనులు అప్పగించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని ఆదేశించామన్నారు. ఈ సీజన్‌కు నీరందించేలా పనులు చేపట్టామని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలను తెలుసుకునేందుకు జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ బ్యారేజీ సందర్శనకు వస్తుందన్నారు. తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తమ్మిడిహెట్టి ప్రాజెక్టు తప్పనిసరిగా నిర్మిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌తోపాటు పలు శాఖ అధికారులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతి నిధులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement