సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ తిరుమల్
కమలాపూర్, జనవరి 6 (ఆంధ్రప్రభ) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి గూడెం గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహానికి చెందిన అవశేషాలు బయటపడ్డాయి. సోమవారం మర్రిపల్లిగూడెం గ్రామ శివారులోని ఓ రైతు పొలం వద్ద సుమారు 40సంవత్సరాల వయస్సు కలిగిన మహిళ మృతదేహానికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డ వార్త పోలీసుల దాకా చేరింది. దాంతో వెంటనే సంఘటన స్థలానికి కాజీపేట ఏసీపీ తిరుమల్ తో పాటు ఇక్కడి ఇన్ స్పెక్టర్ హరికృష్ణ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
బయటపడ్డ మహిళ మృతదేహానికి సంబంధించిన అవిశేషాలతో పాటు ముదురు రంగు పసుపు చీర, ముదురు ఆకుపచ్చ జాకెట్టు, నీలిరంగు లంగా లభ్యమైనట్లు తెలిసింది. పుచ్చిపోయిన తలకు నలుపు రంగు వెంట్రుకలు ఉన్నట్లు గమనించిన పోలీసులు ఆమె వయసు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలలోపు ఉంటుందని తెలిపారు. పంట పొలాల మధ్యన గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పడేశారా, లేక ఆమె ఆత్మ హత్య చేసుకుందా ? అనే అనుమానాలు గ్రామంలో వినిపిస్తున్నాయి.
సుమారు రెండు మూడు నెలల క్రితం హత్య చేసి మూటగట్టి పొలంలో పాతి పెట్టగా ప్రస్తుతం పొలం దున్నుతున్న సమయంలో ఆ మృతదేహానికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయని గ్రామానికి చెందిన మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో బయటపడ్డ మహిళ మృతదేహానికి సంబంధించిన అవశేషాల సంఘటనపై పోలీసులు గట్టి విచారణ మొదలుపెట్టారు.