Tuesday, November 26, 2024

TS Assembly: అసెంబ్లీలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల.. కొనసాగుతున్న చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు.

30 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్‌ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్‌ సరఫరానే వెన్నెముక అన్నారు. రవాణా, సమాచార రంగాలకు మనుగడకు విద్యుత్‌ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుతేనని చెప్పారు.

డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించడంలేదని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆరోపించారు. 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.81,516 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా డిస్కంలు రూ.62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలతో విద్యుత్ రంగం ఆర్థికంగా కుదేలయిందని, ఈ స్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement