ఖమ్మం జిల్లా వర ప్రసాదిని సీతారామ ప్రాజెక్టును 90శాతం తాము పూర్తి చేశామని, మీరు తట్టెడు మట్టిని కూడా పోయలేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నీళ్ల కోసం తాను హరిప్రియ గత ప్రభుత్వంలో కేసీఆర్ ను కానీ, హరీశ్ రావు ను కానీ అడగలేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు కోసం కేసీఆర్ తో కలిసి తాను మారేళ్లపాడు ట్యాంక్ వద్ద వేసిన శంకుస్థాపన శిలాఫలకం చూస్తే మీ మాటలన్నీ అబద్ధాలేనని తేటతెల్లమవుతున్నాయని రేగా అన్నారు. మీరు చెప్పే అబద్దాలు వింటే.. మీరు ఎంత అజ్ఞానులో అర్థమవుతుందన్నారు. మా జిల్లాలో నీటి కోసం తాము పోరాడుతుంటే అక్రమంగా తమను అరెస్ట్ చేయడం ఏమిటని రేవంత్ ను నిలదీశారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సీతారామ ప్రాజెక్టు నుంచి సాగునీరు వచ్చేంత వరకు తమ పోరాటం ఆపేది తేల్చి చెప్పారు రేగా.