హైదరాబాద్, ఆంధ్రప్రభ: వీఆర్వోలను రద్దు చేసి గడుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రెవెన్యూలో ఆశించిన ఫలాలు రావడం, సంస్కరణలతో మెరుగైన ఫలితాల నేపథ్యంలో ఇక నూతన పోస్టుల భర్తీతో ఈ శాఖను మరింత పకడ్బంధీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గత సోమవారంనుంచే ఈ శాఖలో క్యాడర్ స్ట్రెంగ్త్ వివరాలను సేకరిస్తోంది. ఉమ్మడి 10 జిల్లాల్లోని మొత్తం ఉద్యోగులు ఎందరున్నారు. కొత్త జిల్లాల్లో ఎంత మేర సిబ్బంది అవసరం ఉంది..ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలున్నాయనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. కలెక్టర్లనుంచి వివరాలను సేకరిస్తున్న సీసీఎల్‌ఏ సిబ్బంది ఈ వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో పొందుపరుస్తున్నారు. కొత్తగా 23 జిల్లాల ఏర్పాటు, నూతన మండలాలు, రెవెన్యూ డివిజన్లతో రెవెన్యూ శాఖలో బారీగా సిబ్బంది అవసరం నెలకొంది. పెరిగిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు అనుగుణంగా ప్రభుత్వం క్యాడర్ స్రెంగ్త్ పెంచలేదు. దీంతో ఈ శాఖలో సిబ్బంది తక్కువగా ఉండటంతో పనిఒత్తిడి తీవ్రమవుతోంది. రెవెన్యూ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా 39వేలకుపైగా క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్దారించగా, పలు ఖాళీలు ఏళ్లుగా నెలకొన్నాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో కూడా ఖాళీలు ఎక్కువగా ఉండటంతో క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచాలని యోచిస్తున్నారు.
కాగా వీఆర్వోల వ్యవస్థ రద్దు నేపథ్యంలో 5485 మంది వీఆర్వోల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. ఏడాదిగా వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జాబ్‌చార్ట్ లేకపోవడంతో వీరిని ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా కలెక్టర్లు, తహశీల్దార్లు సేవలకు వినియోగిస్తున్నారు. వీఆర్వోల రద్దుతో మండలస్థాయినుంచి గ్రామస్థాయికి ఏర్పడిన అంతరాన్ని పూరించేందుకు సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. జోనల్ పోస్టుల సర్దుబాటు పూర్తవగానే నియామకాలతో బలోపేతంతోపాటు, వీఆర్వోలను సర్దుబాటు చేసే యోచన పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కొత్త ఆర్వోఆర్ చట్టం రాకతో తహశీల్దార్లకు బాధ్యతలు తగ్గాయి. జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ధరణిలో తప్పుల సవరణకు కలెక్టర్ల లాగిన్‌లో డిప్యుటీ తహశీల్దార్లు, ఆర్డీవోలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీఆర్వోలు నామమాత్రమయ్యారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల గుర్తింపు, దృవీకరణ పత్రాల జారీ, ప్రోటోకాల్ విధులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి అనేక విధులను తహశీల్దార్లే నిర్వహిస్తున్నారు. గతంలో వీఆర్వోలు ఈ విషయాల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో లోటును పూరించేందుకు ఒక్కో రెవెన్యూ మండలానికి 10మంది జూనియర్ అసిస్టెంట్లను, ఇప్పుడున్న ఇద్దరు ఎంఆర్‌ఐలను నాలుగుకు పెంచడం, తహశీల్దార్ కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంగ్త్‌ను 18కిపైగా పెంచడం వంటి చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
వీఆర్వోల రద్దుతో వీఆర్‌ఏలకు పనులను అప్పగించాలని భావించినప్పటికీ అర్హులైన వీఆర్‌ఏల సంఖ్య తక్కువగా ఉండటం, పలు ఇతర కారణాలతో ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. 26వేల వీఆర్‌ఏలలో 12వేల మందిని గ్రామానికి ఒకరు చొప్పున కేటాయించి మరికొందరిని ఇతర శాఖల్లో విలీనం చేయాలనే యోచన పరిశీలనలో ఉంది. ఇక వీఆర్వోలలో రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న కొందరిని తహశీల్దార్ల వద్ద సహాయకులుగా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో కొనసాగించాలని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా 1500మంది వీఆర్వోలు ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు ఓకే చెప్పడంతో వారి సర్దుబాటు సమస్య కాదని సమాచారం. రికార్డు సెక్షన్‌లలో కొందరిని, నీటిపారుదల శాకలో మరికొందరిని, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో వీలైనచోట్ల సర్దుబాటు దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాతే ఖాళీల భర్తీపై కీలక నిర్ణయంతోపాటు క్యాడర్ స్ట్రెంగ్త్‌ను పెంచేందుకు చర్యలు తీసుకోనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, క్యాడర్‌స్ట్రెంగ్త్ పెంపు దిశగా రెవెన్యూ శాఖ చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. వీఆర్‌ఏనుంచి వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డిప్యుటీ తహశీల్దార్ల క్యాడర్ స్ట్రెంగ్త్, జిల్లాల వారీగా పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, ఖాళీల వివరాల కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీసీఎల్‌ఏ కార్యదర్శి లేఖలు రాశారు. కలెక్టర్లు ఆయా వివరాలను ఆర్ధిక శాఖ పోర్టల్‌కు అందించాలని ఆదేశించారు. తాజాగా కలెక్టర్ల దగ్గర ఉన్న వివరాల ఆదారంగా వాస్తవిక వివరాలు సేకరించాలని సీసీఎల్‌ఏ కార్యాలయం నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.