హైదరాబాద్ – బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ మిత్ర ధర్మం మరిచి మోసం చేశారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.. రాజకీయాలలో మోసం చేసే వారు, మోసపోయేవాళ్లు ఉంటారని వ్యాఖ్యానించారు . మంగళవారం ఆయన మాట్లాడుతూ మునుగోడులో బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్‌కు మద్దతిచ్చామన్నారు. కలిసి ఉందామని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ తర్వాత ఇప్పుడు లెక్క ఎందుకు మారిందో ఆయనే చెప్పాలన్నారు. మునుగోడులో మద్దతివ్వడం తమ తప్పు కాదన్నారు. కేసీఆర్‌ను తాము నమ్మడం కాదని, ఆయన తమను అవసరానికి వాడుకున్నారని తీవ్ర విమర్శలు చేసారు.
పొత్తుపై కేసీఆర్ తమతో రెండుమూడుసార్లు మాట్లాడారని, కానీ సీట్ల ప్రకటన సమయంలో తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. బిఆర్ ఎస్ తో పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదన్నారు. సీపీఎం, సీపీఐ.. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమన్నారు. లేదంటే కమ్యూనిస్టులం కలిసి వెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మాత్రం వామపక్షాలు కలిసి ముందుకు సాగుతాయన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తామన్నారు.. వామపక్షాలకు సగంపైగా సీట్లలో ప్రభావం చూపే ఓటు బ్యాంకు ఉందని అన్నారు.