Thursday, November 21, 2024

విద్యాశాఖలో కొలువుల జాతర.. జూనియర్‌ కాలేజీల్లో 1523 పోస్టుల భర్తీకి చర్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్‌ విద్యాశాఖలో కొలువుల జాతర మొదలైంది. రాష్ట్రంలో ఇంటర్‌ విద్య బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున జూనియర్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 అధ్యాపకుల పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అదే విధంగా 40 లైబ్రేరియన్‌ పోస్టులు, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు కూడా భర్తీ కానున్నాయి. జూనియర్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు కలిపి మొత్తంగా 1523 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపుతూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు శుక్రవారం జీవో 117ను విడుదల చేశారు.

రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ తాజాగా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. జూనియర్‌ కళాశాలల్లో భర్తీ చేయనున్న1 523 పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేయనుంది. స్థానిక కోటా రిజర్వేషన్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్స్‌ , ఖాళీల వివరాలు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న తర్వాత టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యదర్శులు రిజర్వేషన్‌ రూల్స్‌, స్థానికత అంశాలను పరిగణనలోనికి తీసుకుంటూ ఆర్థికశాఖ అనుమతించిన మేరకు ఖాళీల వివరాలను టీఎస్‌పీఎస్సీకి సమర్పించాలని ఆదేశించారు.

ఇంటర్‌ విద్య జేఏసీ హర్షం
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1392 లెక్చర్లు, 40 లైబ్రరీయన్లు, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఇంటర్‌ విద్య జేఏసీ ఛైర్మన్‌ డా. పీ. మధుసూధన్‌రెడ్డి స్వాగతించారు. తాజా నియామకాలతో రాష్ట్రంలో ఇంటర్‌ విద్య బలోపేతం అవుతుందని, నిరు పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఖాళీల భర్తీకి జీవో 117ను జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌, ఆర్థికశాఖా మంత్రి హరీష్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement