హైదరాబాద్, ఆంధ్రప్రభ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రికార్డు స్థాయిలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. శుక్రవారం 10:35 గంటలకు 9910 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యింది. ఈ సీజన్‌లో భారీగా వర్షాలు పడటం, నీటి లభ్యత పెరగడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండటంతో వ్యవసాయ రంగంలో డిమాండ్ భారీగా పెరుగుతున్నది.
తాజా సీజన్ లో అత్యధిక డిమాండ్ 10000 మెగావాట్లను కూడా దాటే అవకాశం ఉన్నదని, డిమాండ్ ఎంతగా పెరిగినా దానికి తగ్గట్టు విద్యుత్ సరఫరా అందిస్తామని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 20న ఉదయం 10:00 గంటలకు 9862 మెగా వాట్లు అత్యధిక డిమాండ్ నమోదయ్యింది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ వారంలో సరాసరి విద్యుత్ డిమాండ్ 9317 మెగావాట్లు ఉండగా గతేడాది 9138 మెగా వాట్లు, సరాసరి వినియోగం 190.29 మిలియన్ యూనిట్లు కాగా, గతేడాది 182.11 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యింది.