స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి తెలంగాణా శాసన మండలి సభ్యుని ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎన్నికకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్.డి.ఓ. కార్యాలయాలు, తహశీల్ధార్, మండల పరిషత్ కార్యాలయాలు, మునిసిపాలిటీలలో నోటీసు బోర్డులపై ప్రదర్శించవలసినదిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ సెలవు దినాలైన 19, 21 మినహా ఈ నెల 23వరకు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లేదా సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ నుండి నిర్దేశించిన సమయంలో పొంది ఆ పత్రాలను ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి ఛాంబర్ లో అభ్యర్థి గాని, అతని ప్రతిపాదకునిచే అందజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 24 న పరిశీలిస్తామని, నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థులు ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలలోగా నోటీసును ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారికి, అభ్యర్థి లేదా అతని ప్రతిపాదకునిచే అందజేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ తెలిపారు. కాగా మంగళవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని కలెక్టర్ తెలిపారు.