నిజామాబాద్. – టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతుంటే.. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్‌జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ, ” టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం రోజుకో మాట చెబుతోంది. మొదట హ్యాక్ అయిందన్నారు. తర్వాత హనీట్రాప్ జరిగిందన్నారు. ఇప్పుడేమో లీకైందంటున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గాని, రాష్ట్రప్రభుత్వం గానీ ఇప్పటి వరకు ఎందుకు వివరణ ఇవ్వలేదు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు చేసిన తర్వాత వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రకటిస్తే.. దాదాపు 30లక్షల మంది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల దాదాపు 2వేల మంది యువకులు చనిపోయారు. పోటీ పరీక్షలు నిర్వహించినా పలు కారణాలతో వాటిని రద్దు చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. టీఎస్‌పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. గ్రూప్-1 పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానం ఉంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక పెద్దల హస్తం ఉంది” అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు
Advertisement
తాజా వార్తలు
Advertisement