Monday, November 25, 2024

TS : ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా…..బండి సంజయ్

ఆంధ్రప్రభ, కరీంనగర్ః వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు నా ఆస్తిపాస్తుల పై చేస్తున్నఅవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిబిఐ విచారణకు నేను సిద్ధం మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.

- Advertisement -

మీరు ఓకే అంటే సీబీఐకి లేఖ రాసేందుకు నేను సిద్ధమన్నారు. దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలన్నారు. కరీంనగర్ లో గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతోందని, ఎవరి పక్షాన నిలిచి ఓటేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. దేశంలో ఎన్నికలు సైతం నరేంద్రమోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టు అని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్నారు.

తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, తనను అరెస్ట్ చేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని చెబుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుందన్నారు. జూన్ 4 న కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందన్నారు.

రేపు వేములవాడకు ప్రధాని మోడీ

రేపు ఉదయం 8 గంటలకే నరేంద్రమోదీ వేములవాడకు వస్తున్నారన్నారు. వేములాడ రాజన్నను దర్శించుకుని 9 గంటలకు వేములాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఎండలున్న నేపథ్యంలో బహిరంగ సభకు వస్తున్న వారి కోసం కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement