Friday, November 22, 2024

Big story | ధరణి రికార్డులతోనే రీ సర్వే.. ప‌క్కాగా డిజిటలైజేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ధరణిని మరింత ఆధునీకరిస్తున్న ప్రభుత్వం బహుళార్ద ప్రయోజనాలే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దుతోంది. సమస్యలను నివారించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చిక్కులులేని భూ హద్దులకు వీలుగా చేపట్టాలని భావిస్తున్న సర్వేకు ధరణి రికార్డులనే ప్రామాణికం చేసుకోనున్నారు. ఆ తర్వాత డిజిటల్‌ సర్వేకు ధరణి రికార్డులే కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే డిజిటలైజ్‌ చేసి ధరణిలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని సర్వేకు వీలుగా వాడుకోనున్నారు. ప్రభుత్వం కూడా ధరణి పోర్టల్‌లో ఉన్న సమాచారానికి విరుద్దంగా సర్వే ఉండొద్దని భావిస్తోంది. పోర్టల్‌లో ఉన్న రైతుల భూముల వివరాల ఆధారంగా సర్వే ఉండాలని నిర్ణయించింది.

అందుకే ధరణి పోర్టల్‌లో సరికొత్త మాడ్యూళ్లను చేర్చింది. ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యాచరణలో భాగంగా సర్వే శాఖ భూ దస్త్రాల వివరాలను గ్రామ పటాలు, నక్షాలను సిద్దం చేస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళనతో వెలుగులోకి వచ్చిన వివరాలను డిజిటలైజ్‌ చేయడంతో ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో ఈ వివరాలు ఉన్నాయి.దేశంలోనే విప్లవాత్మక పథకాలు, విధానాలకు తొమ్మిదేళ్ల తెలంగాణ పాలన మైలురాయిగా నిల్చింది. దశాబ్దాలనాటి కలను వాస్తవంలోకి తెచ్చిన సర్కార్‌ 86 ఏళ్లనాటి భూ సమస్యల నివారణా సంకల్పం విజయవంతమైంది. 1931లో చేపట్టిన భూ సర్వేకు ధీటుగా దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా పూర్తిచేసి రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపింది.

- Advertisement -

హైదరాబాద్‌ మినహా 584 మండలాల్లోని 10823 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించి వివాదాలు లేని భూ రికార్డుల రాష్ట్రంగా రికార్డులు డిజిటలైజ్‌ చేసింది. మొత్తం 72,09,694 భూ ఖాతాలకు చెందిన 2,38,28,180 ఎకరాల భూ రికార్డులను పరిశీలించి, 1,12,077 చదరపు కిలోమీటర్ల భూభాగంలోని భూ రికార్డులను డిజిటలైజ్‌ చేశారు. రాష్ట్రంలో 1,12,077 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉండగా ఇందులో 2.80 కోట్ల ఎకరాల భూభాగపు లెక్కలు డిజిటలైజ్‌ చేశారు. తాజా భూ రికార్డుల సర్వేలో 1.42కోట్ల ఎకరాల వివాదరహిత వ్యవసాయ భూమి ఉందని తేలింది. మరో 17.89లక్షల ఎకరాల భూమి వివిధ న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నట్లుగా తేల్చారు.

మరో 11.95లక్షల ఎకరాల వ్యవసాయేతర భూమి ఉండగా, 84.00లక్షల ఎకరాల్లో చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వేలైన్‌, సబ్‌స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింది భూములు, కోర్టు కేసుల్లోని అటవీ భూములు ఉన్నట్లుగా నిర్ధారించారు. 24 లక్షల ఎకరాల భూములు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీ భూములుగా నివేదించిన విషయం వెల్లడైంది. ఇక ఇప్పుడు వీటికి కట్టుదిట్టమైన రికార్డుల రూపకల్పన ఉండగా సర్వేతో హద్దులు నిర్ణయించనున్నారు.నక్షాల ప్రామాణికంగా అక్షాంశాలు-రేఖాంశాలతో హద్దుల గుర్తింపు దిశగా యోచిస్తున్న ప్రభుత్వం అసెంబ్లి ఎన్నికలు ముగిసిన వెంటనే తొలి ప్రాధాన్యతగా సర్వేకు సిద్ధమవుతున్నది.

వచ్చే ఏడాది జనవరి తర్వాత హద్దు రాళ్ల గుర్తింపు చేపట్టాలని, ఆ వెంటనే సబ్‌ డివిజన్ల వారీగా మ్యాపులు కూడా రూపొందించాలని భావిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ విస్తీర్ణానికి, రికార్డుల మధ్య తేడాల సవరణ జరుగుతుందని ధీమాగా ఉన్నది. రాష్ట్రంలో సాగు భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి మధ్య 38 లక్షల వ్యత్యాసం ఉందని లెక్కలు చెబుతున్నారు. అయితే జనవరి తర్వాత తొలుత నోటీసుల జారీ, రీ సర్వే షెడ్యూల్‌ ఖరారు చేయాల్సి ఉంది. ఈ సరికొత్త రీ సర్వే పద్ధతిలో రైతులు, భూ యజమానులకు దాదాపు 32 ప్రయోజనాలు కల్పించేలా సర్కార్‌ వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తోంది. వాస్తవానికి రాష్ట్రంలో గతేడాది జూన్‌ 11నుంచి చేపట్టాల్సిన సర్వే అర్ధాంతరంగా నిల్చిపోయింది. సర్వేకు 8 సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే ప్రభుత్వం పునరాలోచన చేసి మొత్తంగా కార్యాచరణతో రైతాంగానికి మరిన్ని ఫలితాలు సిద్దించేలా పూర్తిస్థాయిలో ధరణి సమస్యలు నివారించి సరికొత్తగా సర్వేకు వెళ్లనున్నారు.

గతంలో ఇలా…సమస్యలు అనేకం…

1875కు ముందు అశాస్త్రీయమైన రెవెన్యూ వ్యవస్థలుండేవి. టెండర్‌ ఆహ్వానించి కౌలునామా రాయించుకొని ఒక హుకుంనామాను జారీ చేసేవారు. అప్పటి రెవెన్యూ పరిభాషలో ‘సనద్‌’ అంటూ జారీ చేసేవారు. ఇక భూమి శిస్తు వసూళ్లకు, ఇతర పనులను కాంట్రాక్టర్లకు అప్పగించేవారు. పోలీసు పాలనను, భూమి శిస్తు వసూళ్లను తాలూఖ్‌దార్లకు, నాయబ్‌లకు అప్పగించడం, కొన్నిసార్లు ప్రభుత్వాలే నేరుగా పెద్ద రైతులతోనే సంబంధాలు పెట్టుకున్న సందర్భాలున్నాయి. స్థానిక జమిందారులు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు తాలూఖ్‌దారుల నుంచి ఉప కౌలుకి తీసుకొని ప్రతి గ్రామాన్ని మదింపు చేసేవారు. ఇలాంటి వసూళ్లకు గ్రామ ప్రజలందరినీ బాధ్యులుగా చేయడం జరిగేది. ఈ ఇబ్బడి ముబ్బడి వ్యవస్థ కొన్నేళ్లపాటు కొనసాగింది. దీనివల్ల వ్యవసాయదారులందరూ కష్టాల పాలయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ప్రభుత్వ తన ఆర్థిక పరపతిని కొంతమేర నస్టపోయింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టదల్చుకున్న సర్వే పనులు, కేంద్రం కూడా అన్ని భూములను మరోసారి సర్వే చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర భూములు 1,12,770 చదరపు కిలోమీటర్లు. అందులో అడవులు, సాధారణ భూములు, హెచ్‌ఎండీఏ భూములు, ప్రభుత్వ భూములు మొత్తం 12,800 గ్రామాలు, 33 జిల్లాల్లో ప్రతి మండల పరిధిలో ఒక గ్రామం పైలెట్‌ ప్రాజెక్టుగా సర్వే పనులు చేద్దామంటూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement