Thursday, November 21, 2024

Big Story : పక్కదారి పడుతున్న రేషన్‌ బియ్యం.. మిల్లుల్లో యథేచ్ఛగా రీసైక్లింగ్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పక్కదారిపడుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం రవాణాపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పలు మిల్లుల్లో రీసైక్లింగ్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాఇప్తంగా అన్ని జిల్లాల్లో ఈదందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పేదల నుంచి సేకరిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని దళారులు రైసు మిల్లులకు, పౌల్ట్రి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాలకు యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేయడం నిత్య కృత్యంగా మారింది. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు నామమాత్రంగా ఒకటి , రెండు చోట్ల లారీలను సీజ్‌ చేస్తూ మమ అనిపిస్తున్నారు.

సాధారణ పరిస్థితుల్లో ప్రజల ఆహార భద్రత కోసం, కొవిడ్‌ విపత్కర పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. కొవిడ్‌ కాలం నుంచి అదనంగా రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. అదే సమయంలో తెలుపు కార్డు ఉన్న లబ్దిదారులందరూ రేషన్‌ బియ్యాన్ని తమ రోజువారీ ఆహారంలో విరివిగా వినియోగించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల వద్ద రేషన్‌ బియ్యం పేరుకుపోతున్నాయి. దీంతో లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళుతున్న దళారులు ఇంటింటికీ తిరిగి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు… రూ.5 నుంచి రూ.7 మధ్యన కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని రైసు మిల్లర్లికు కిలో రూ.10 నుంచి రూ.12చొప్పున అమ్ముకుంటున్నారు.

కొద్ది రోజుల కిందటే రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌ ప్రక్రియ యథేచ్ఛగా నడుస్తున్నట్లు చెబుతున్నారు. మహబూబాద్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిపోతోంది. ఈ మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న మరిపెడ మండల కేం ద్రంగా రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మినీ వాహానాల్లో సేకరించిన బియ్యాన్ని లారీల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

లేవీ బియ్యం పేరుతో ఎఫ్‌సీఐకి అప్పగింత…

రాష్ట్రంలోని కొన్ని రైసు మిల్లులు ప్రధానంగా పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసే కార్యక్రమం మీదనే నడుస్తున్నాయి. రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ దందా వెనక రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ ) అనుమతి పొందిన చాలా వరకు రైసు మిల్లులు … తమ మిల్లుల లేబుల్స్‌ పై ఉన్న గన్నీ బస్తాలు తెచ్చుకుని రీసైక్లింగ్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని తిరిగి ఎఫ్‌సీఐకి లేవీ బియ్యం కోటా కింద అంటగడుతున్నారన్న విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సీఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని బయట మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించుకుని తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి తమ మిల్లు పేరుతో ఉన్న లేబుల్‌ బస్తాల్లో నింపి ఎఫ్‌సీఐకి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మిల్లుల యజమానులు నేరుగా రేషన్‌ దుకాణాల నుంచే బియ్యాన్ని మిల్లులకు తరలిస్తూ రీసైక్లింగ్‌ చేసి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

పౌల్ట్రి ఫాంలకు విక్రయం…

సేకరించిన రేషన్‌ బియ్యాన్ని నూకలు, పిండిగా మార్చి తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రిdఫాంలకు తరలిస్తున్టన్లొ సమాచారం. పౌల్ట్రి సంస్థలకు రేషన్‌ బియ్యాన్ని రూ.18 నుంచి రూ.25కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

చోద్యం చూస్తున్న పౌరసరఫరాలశాఖ ..

షన్‌ బియ్యం అక్రమ రవాణా, రీసైక్లింగ్‌ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని పైకి చెబుతున్న పౌరసరఫరాల శాఖ అధికారులు లోపాయికారిగా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సివిల్‌ సప్లై అధికారులు, టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఎన్నిసార్లు దాడులు చేసి రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ను పట్టుకుంటున్నా దందా మాత్రం ఆగడం లేదు. లేవీ ముసుగులో సాగుతున్న అక్రమదందాపై అధికారులు దృష్టిపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement