ఈనెల 16నుంచి రథసప్తమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేడుకలను ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఏడవ రోజు సప్తమి తిథిని రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీన వస్తుంది. రథసప్తమి పర్వదినాన శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ప్రసిద్ధ ఆలయాలలో ఘనంగా వేడుకలు జరగనున్నాయి.
రథ సప్తమి నాడు స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. రథ సప్తమి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని, అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకృతులను చేసి సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి, ఉదయం 6:40 నిమిషాలకు స్వామివారి ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేయనున్నారు.ఆపై చతుర్వేద పారాయణం నిర్వహించనున్నారు. అంతేకాదు రథసప్తమి విశిష్టత భక్తులందరికీ విశదీకరించి చెప్పనున్నారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ నరసింహ స్వామి వారిని, అమ్మవారి సమేతంగా స్వర్ణ రథంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించనున్నారు.