ఓ వివాహితకు వలపు వల
చిట్టీ.. బుజ్జీ.. అంటూ సాన్నిహిత్యం
పచ్చని సంసారంలో చిచ్చు
ఏకాంతంలో గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
ఖమ్మం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం క్రైమ్: కేసు విషయంలో కోర్టుకు వచ్చిన వివాహితపై ఓ కానిస్టేబుల్ కన్నువేశాడు. చెల్లి.. బుజ్జీ అంటూ సన్నిహితం పెంచుకున్నాడు. ఆర్థికంగా బాగుంటుందని చైన్‌లింక్ వ్యాపారం అంటగట్టాడు. ఇలా వారిద్దరూ దగ్గరయ్యారు. ఆమె భర్తకు అనుమానం వచ్చి నిఘా వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కానిస్టేబుల్ నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టుకునేలా పోలీసు అధికారులకు వీడియో చూపించాడు. పదేళ్ల కిందట ప్రేమ.. బూడిదలో పోసిన పన్నీరులా మారిందని నిరూపించాడు. ఆమె వ్యవహారంతో పలువురు ముక్కున వేలు వేసుకున్నారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాంబు స్వ్కాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారం తీరు పోలీసు శాఖకే మచ్చ తెచ్చింది.
ట్రాప్ చేశాడు ఇలా..
ఓ కేసు విషయంలో కోర్టుకు వచ్చిన మహిళతో కానిస్టేబుల్ రాంబాబు పరిచయం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు తీరడానికి ఒక చైన్ లింక్ మార్కెటింగ్‌లో ఆమెను చేర్పించాడు. ఈ క్రమంలోనే చెల్లి… బుజ్జీ అంటూ మరింత సన్నిహితమయ్యాడు. లొంగదీసుకున్నాడు. కొద్ది రోజులకు రాంబాబు వ్యవహారంలో అనుమానం వచ్చిన ఆమె భర్త నిఘా వేశాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మహిళ భర్తపై దాడి చేసేందుకు కానిస్టేబుల్ రాంబాబు, ఆమె ప్రయత్నించారు. అంతకు ముందు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను ఆ మహిళ సెల్లోనే భద్రపరిచాడు.
పదేళ్ల కిందట ప్రేమ వివాహం..
అతడిని పదేళ్ల కిందట ఆ మహిళ ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు కుమారులున్నారు. పిల్లలు, భర్త ఉండగానే ఇలా మరొకరి ట్రాప్‌లోకి ఆ మహిళ వెళ్లడంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు.
పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు..
కానిస్టేబుల్ రాంబాబు వ్యవహారంపై ఖమ్మం సీపీకి ఆ మహిళ భర్త ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు ఆ మహిళపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేసి కేసు విచారణ చేపట్టాలని బాధితుడు పోలీసులను కోరాడు.