Tuesday, November 19, 2024

RR : వసతులను కల్పిస్తేనే ఓట్లు వేస్తాం – కొడిచెర్ల తండా గ్రామస్తుల నిర‌స‌న‌

కొత్తూరు, మే 13(ప్రభ న్యూస్) : తమకు వసతులను కల్పిస్తేనే తాము ఓటింగ్ లో పాల్గొంటామని లేకుంటే ఓటింగ్ లో పాల్గొనే ప్రసక్తే లేదని ఓటర్లు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో కొడిచర్ల తండా గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కొడిచర్ల తండా గ్రామస్తులు సోమవారం తమకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని అందుకు పోలింగ్ లో తాము పాల్గొనబోమని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కోడిచెర్ల తండా ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడినప్పటికీ నేటికీ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని, చౌకధార దుకాణాన్ని ఏర్పాటు చేయలేదని, గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

కొడిచర్ల తండా గ్రామం నుండి కొడిచర్ల గ్రామానికి ఓటు వేయాలన్న, రేషన్ తీసుకోవాలన్న నాలుగు కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించాల్సిందేనని, వృద్ధులు రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో తమ సమస్యలను అధికారులతో మొరపెట్టుకున్నా ఎటువంటి ఫలితం లేకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం తమకు రేషన్ దుకాణం, పోలింగ్ కేంద్రం, బస్సు సౌకర్యం కల్పిస్తేనే తాము ఓటింగ్ లో పాల్గొంటామని రోడ్డుపై బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు.

- Advertisement -

దీంతో స్పందించిన తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇన్ స్పెక్ట‌ర్ నరసింహారావు కొడిచెర్ల తండాకు చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణం ఏర్పాటుకు వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులతో చర్చించి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నాను విరమించి ఓటింగ్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement