శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : చిత్తడి నేలలు, చెరువులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అడిషనల్ సెక్రెటరీ ప్రశాంతి తెలిపారు. చిత్తడి నేలలు, చెరువుల పరిరక్షణకై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామ చెరువు వద్ద గురువారం ఉదయం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రామాల్లో వారసత్వ సంపదగా వస్తున్న చెరువులు, చిత్తడి నేలలను కాపాడుకుంటూ భావితరాలకు అందజేసే ఉద్దేశంతో, విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వారు పెద్ద ఎత్తున చేపట్టారు. గ్రామీణ వ్యవస్థలో అతి ముఖ్యమైన విభాగాలు అయిన రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, హెచ్ఎండిఎ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫిషరీస్, ఫారెస్ట్, ఎన్జీవోలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి పలువురు శాస్త్రవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి ఐఏఎస్ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి ప్రశాంతి మాట్లాడుతూ… రాబోయే తరాలకు వాటి ప్రాధాన్యతను గుర్తించే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. చిత్తడి నేలలు, చెరువులు వాటి ఉపయోగాలను శాస్త్రవేత్తలు విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ, డిఎంఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఇ, డిఇ, ఇరిగేషన్ శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, చిన్న నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు రాధిక, గోపి రాజ్, స్థానిక నాయకులు నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, వాటర్ బాడీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.