వికారాబాద్ : జిల్లాలో కొందరు వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. చవివింది ఒకటి..చేస్తున్న వైద్యం మరొకటి కావడం గమనార్హం. ఇలాంటి వైద్యుల కారణంగా కొన్ని సందర్భాలలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. అయినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన వైద్య వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బయటకు రాకుండా వైద్యం చేసిన వైద్యుడు జోరుగా బేరాలు సాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని తాండూరు పట్టణంలో బస్టాండ్ పక్కనే ఒక వైద్యుడు ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఈ వైద్యులు వాస్తవానికి మత్తు డాక్టర్(అనస్తీషియా) శస్త్రచికిత్సలు జరిగే సమయంలో సదరు డాక్టర్ రోగికి మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ వైద్యుడు మాత్రం అలా చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు తన ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తాడు. అన్ని రకాల శస్రచికిత్సలను నిర్వహిస్తాడు. ముఖ్యంగా ప్రసవాలు జోరుగా నిర్వహిస్తారు. జిల్లా ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు అక్కడే ఉండే కొందరు వైద్య సిబ్బంది సహాయంతో మాయమాటలు చెప్పించి తన ప్రైవేటు ఆసుపత్రికి వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా వచ్చే గర్భిణీలకు ఆయనే స్వయంగా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. మత్తు డాక్టర్ కాస్త గైనకాలజిస్ట్‌గా మారి ఆసరేషన్లు చేస్తున్నారు. ప్రతీ వైద్యుడికి ఒక గుర్తింపు సంఖ్యను ఇస్తారు. ఈ వైద్యుడి జారీ చేసిన గుర్తింపు సంఖ్యపై కూడా వైద్య వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ మత్తు డాక్టర్ ఇటీవల కోడంగల్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మహిళకు గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేసేందుకు వెళ్లారు. కేవలం మత్తు ఇవ్వడంలోనే నిపుణుడైన ఆయన ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ వికటించి సదరు మహిళ మృతి చెందింది. ఈ ఘటన కోడంగల్‌లో కలకలం రేపింది. గర్భసంచి సమస్య కొరకు వస్తే ప్రాణాలు తీస్తారా అని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయిదాటక ముందే మత్తు డాక్టర్ అక్కడి నుంచి పారిపోయి తాండూరుకు చేరుకున్నారు. చనిపోయిన మహిళ బంధువులు తాండూరుకు కూడా వచ్చి మత్తు డాక్టర్‌ను నిలదీస్తున్నారు. ఈ ఘటన నుంచి బయటపడేందుకు మత్తు డాక్టర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి కొంత పరిహారం ఇచ్చేందుకు చర్చలు సాగిస్తున్నారు. అయితే బాధిత కుటుంబం మాత్రం తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మత్తు డాక్టర్ శస్త్రచికిత్సలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మత్తు డాక్టర్‌ను ఇప్పుడు వదిలిపెడితే ఇంకా ఎందరి ప్రాణాలు తీస్తారో అని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తాండూరులోని బస్‌స్టాండ్ పక్కన ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహించే మత్తు డాక్టర్ కోడంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఆపరేషన్లు చేస్తారు. ఈ మత్తు డాక్టర్ వ్యవహారం వైద్య వర్గాలలో చర్చకు దారితీస్తోంది. నిపుణులైన వైద్యులు తమ నైపుణ్యం మేరకు మాత్రమే పనిచేయాలని..నైపుణ్యం లేని ఇతర విభాగాలలో వేలుపెట్టవద్దని భారత వైద్యుల సంఘం(ఐఎంఏ) స్పష్టంగా సూచించినా అందులో సభ్యత్వం ఉన్న వైద్యులు వినిపించుకోకపోవడంపై ఇతర వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.