Thursday, November 21, 2024

‘లాక్‌డౌన్‌’ రూమర్స్..కిక్కిరిసిపోతున్న ప్రధాన మార్కెట్లు..

వికారాబాద్‌ : కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో కోవిడ్‌ మరణాలు నమోదు అవుతున్నాయి. మొత్తంగా అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ముందుగా వైరస్‌ బారిన పడిన వారికి వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాయి. మరోవైపు కోవిడ్‌ కట్టడికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. మరో పక్కన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు లాక్‌డౌన్‌ అమలులోకి రాక ముందే పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు అన్ని కూడా కిక్కిరిపోతున్నాయి.

సామాజిక మాధ్యమాలలో ఎక్కడ చూసినా లాక్‌డౌన్‌పై విస్తృత ప్రచారం కనిపిస్తోంది. వచ్చే నెల 2వ తేదీ తరువాత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న పూర్తి అవుతుంది. ఆ వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారంకు తెరలేపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న అనేక రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారని.. వారంతపు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని..త్వరలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తారనే ప్రచారం జోరు అందుకుంది. ఈ ప్రచారంను వ్యాపార వర్గాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ప్రజలలో లాక్‌డౌన్‌ భయంను నూరిపోస్తున్నారు.

లాక్‌డౌన్‌ భయంతో ప్రజలు వివిధ సరకుల కొనుగోలుకు మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే సరిపడా కిరాణా సరకుల కొనుగోలుకు ప్రజలు మార్కెట్‌కు తరలివస్తున్నారు. దీంతో పట్టణాలలోని కిరాణా మార్కెట్లు..సూపర్‌ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో భారీ ఎత్తున కిరాణా వ్యాపారం సాగుతోంది. మరోవైపు వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున వివాహాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం భారీ ఎత్తున వివాహాలు చేయడంపై ఆంక్షలు ఉన్నా పెళ్లి ఇంటి వారు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా వస్త్రాల కొనుగోలు..బంగారం కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రచారం విస్తృతంగా జరగడంతో త్వరగా వస్త్రాలు..బంగారంను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో వస్త్ర..బంగారు మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి.

ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా లాక్‌డౌన్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలలో మినీ లాక్‌డౌన్‌ విధించే అంశంపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా లాక్‌డౌన్‌ విధించబోమని తేల్చిచెప్పారు. మరోవైపు లాక్‌డౌన్‌ తరుముకొస్తోంది అంటూ వ్యాపార వర్గాలు ప్రణాళిక ప్రకారం తమ వ్యాపారంను పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాలలో లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement