Friday, November 22, 2024

అడవులలో యధేచ్చగా వేట

జింకలు..అడవి పందులే లక్ష్యం
అర్ధరాత్రి తూటా చప్పుళ్లతో భయంభయం
రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌ బృందం
వికారాబాద్ : జిల్లాలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. యధేచ్చగా అడువులపై పంజా విసురుతున్నారు. రాత్రి..పగలు తేడా లేకుండా అడవులలో జంతువుల వేటను కొనసాగిస్తున్నారు. కొందరు వేటగాళ్లు హైదరాబాద్‌ నుంచి వచ్చి జంతువుల వేట కొనసాగిస్తుండగా మరికొందరు స్థానిక వేటగాళ్లు అడువులలో జంతువుల వేటను సాగిస్తున్నారు. వీరంతా లైసెన్సు లేని తుపాకులను వినియోగించడం గమనార్హం. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న అడవులపై వేటగాళ్లు పంజా విసురుతున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ దృష్టికి వేటగాళ్ల వ్యవహారం వెళ్లడంతో ఆయన టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించారు.

రాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో అడవుల విస్తీర్ణం భారీగా ఉంది. ముఖ్యంగా సరిహద్దులో అటవులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో క్రిష్ణ జింకల ఆవాసంకు జిల్లాలోని అడవులు అత్యంత అనువైనవిగా గుర్తించారు. జిల్లాలోని అటవులలో భారీ సంఖ్యలో జింకలు ఉన్నాయి. వీటికి తోడు అడవి పందుల సంఖ్య కూడా అధికంగా ఉంది. కొన్ని ప్రాంతాలలో నెమళ్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంలో జిల్లా ఉండడం..ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో వేటగాళ్ల కన్ను పడింది. ఇటీవల కాలంలో జిల్లాలోని అడవులలో వేటగాళ్ల కార్యకలాపాలు అధికం అయ్యాయి. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని యాలాల ప్రాంతంలోని అడవులలో ఒక తుపాకి మ్యాగజైన్‌ పశువుల కాపరికి దొరికింది. దీనిపై స్థానిక పోలీసులు కూపీ లాగితే వేటగాళ్ల బండారం బయటపడింది. అంతకు ముందు ఇదే మండల పరిధిలో అడవులకు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో పోలీసులు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీలలో పెద్ద సంఖ్యలో నాటు తుపాకులు..నాటు బాంబులు పట్టుబడ్డాయి. కొద్దిమాసాల క్రితం దామగుండం అడవీలో కొందరు వేటగాళ్లు గోవును తూటాతో కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ వ్యవహారం జిల్లాలో దుమారం రేపడంతో పోలీసులు విచారణ చేయడంతో హైదరాబాద్‌ నుంచి వారాంతంలో వచ్చిన కొందరు వ్యక్తులు వేటాడినట్లు గుర్తించారు. ఇలా జిల్లాలో నిత్యం వేటగాళ్ల తూటా చప్పుళ్లు కలకలం రేపుతున్నాయి.

తాజాగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న బషీరాబాద్‌ మండలంలోని అడవులలో వేటగాళ్లు సాగిస్తున్న వేటను జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం బట్టబయలు చేసింది. దాదాపు అరడజను మంది వేటగాళ్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాటు తుపాకులను.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల తూటాకు బలైన దిప్పి అవశేషాలను స్థానికులు గుర్తించడం గమనార్హం. జిల్లాలో వెలుగు చూస్తున్న వేటగాళ్ల ఆగడాలతో అడవులలో వారు కొనసాగిస్తున్న జంతువుల వేటకు అద్దం పడుతోంది. ఈ వేటగాళ్లు జింకలు, అడవి పందులు, కుందేళ్లను వేటాడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ్లలో వేటగాళ్లు అడవులలో వేటను కొనసాగిస్తున్నారు. వేటగాళ్లు అదుపు చేసేందుకు జిల్లా పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించడంతో పరిస్థితి ఏమేరకు అదుపులోకి వస్తుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement