గ్రామాలకు చేరుతున్న కుటుంబాలు
స్థానికంగా వైరస్ వ్యాప్తికి దోహదం
మూడు మండలాల్లో భారీగా కేసులు
వికారాబాద్..ప్రభన్యూస్ ప్రతినిధి : వలస కార్మికుల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో జిల్లా యంత్రాంగం వీరి విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. వలస పోయిన కార్మికులు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో ఇంటిదారి పడుతున్నారు. ఇంటికి చేరుతున్న వలస కార్మికులతో ఆయా ప్రాంతాలలో కరోనా వ్యాప్తి అధికం అవుతోంది. జిల్లాలోని మూడు మండలాల్లో వలస కార్మికుల కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వలస కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి ఇంటికి చేరుకుంటున్నారు. వీరి విషయంలో ప్రభుత్వం వద్ద సరైన విధానం లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది.
జిల్లాలోని పలు మండలాల నుంచి వేల సంఖ్యలో కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వలసపోతుంటాయి. ముఖ్యంగా జిల్లాలోని తాండూరు, పరిగి, కోడంగల్ నియోజకవర్గాలకు చెందిన కుటుంబాలు వలస వెళుతున్నాయి. వీరంతా ఎక్కువగా మహారాష్ట్రకు వలసపోతుంటారు. ఈ మూడు నియోజకవర్గాలలోని యాలాల, బొంరాస్పేట్, దౌల్తాబాద్, కుల్కచర్ల మండలాలకు చెందిన వారు అధికంగా వలసపోతుంటారు. మరికొందరు హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసపోతుంటారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అక్కడ లౌక్డౌన్ను సైతం అమలు చేస్తున్నారు. అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొనడంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఇంటి బాట పట్టారు. రైళ్లు..వాహనాలలో వలస కార్మికులు ఇంటికి చేరుకుంటున్నారు.
గత ఏడాది కరోనా వైరస్ కట్టడి కొరకు సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేసి పంపించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అంతర్రాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో సరిహద్దు వద్ద నిఘా ఉండడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాలకు వలసపోయిన వారు ఎలాంటి తనిఖీలు లేకుండానే ఇంటికి చేరుకుంటున్నారు. గత కొద్ది రోజుల వ్యవధిలో వేల సంఖ్యలో వలసపోయిన కుటుంబాలు ఇంటికి చేరుకున్నాయి. గ్రామాలకు చేరుకుంటున్న వీరికి ఎలాంటి పరీక్షలు కూడా చేయడం లేదు. వీరిలో చాలా మందికి కోవిడ్ లక్షణాలు ఉంటున్నాయి. వీరి ద్వారా వారి కుటుంబ సభ్యులకు.. వారితో సన్నిహితంగా ఉన్న వారికి కరోనా వైరస్ సోకుతోంది. ఈ కారణంగా ఆయా గ్రామాలలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి ఇంటికి చేరుకుంటున్న వలస కుటుంబాలు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
జిల్లాలోని కుల్కచర్ల, బొంరాస్పేట్, యాలాల మండలాల్లో కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఆదివారం వెల్లడించిన సమాచారం ప్రకారం కుల్కచర్లలో 28, బొంరాస్పేట్లో 33 పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనికి ప్రధాన కారణం వలస కార్మికులు అని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వలస కార్మికులతో ఆయా గ్రామాలలో వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాలలో పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులతో ఆయా గ్రామాలలో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంటి బాట పట్టిన వలస కార్మికులను సరిహద్దులోనే పరీక్షలు నిర్వహించడం లేదా గ్రామాలకు చేరుకుంటున్న కుటుంబాలపై స్థానికంగా ప్రత్యేక నిఘా పెట్టడంతోనే ఆయా గ్రామాలలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు అని వైద్యులు పేర్కొంటున్నారు.