వికారాబాద్ : దక్షిణ తెలంగాణలో కరువులో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలో కొంత భాగంకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల ఫథకంను చేపట్టింది. దాదాపు ఐదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. మొదట రూ.32 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తీవ్ర నిధుల సమస్యతో పాటు భూసేకరణ ప్రాజెక్టుకు శాపంగా మారాయి. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల పాటు ఈ ప్రాజెక్టు పనులపై వరుసగా సమీక్షలు నిర్వహిచి ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం.
ఇదీ ప్రాజెక్టు నేపధ్యం
—————————
శ్రీశైలం వెనుక జలాల నుంచి వరద సమయంలో ప్రతిరోజు 2 టిఎంసిల నీటిని 60 రోజుల పాటు ఎత్తిపోసేందుకు పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రిజర్వాయర్లను నిర్మించాలని మొదట నిర్ణయించారు. ప్రస్తుతం ఐదు రిజర్వాయర్ల పనులు మాత్రమే జరుగుతున్నాయి. నార్గాపూర్, ఏదుల, వట్టెం. కరివెన, ఉద్దండాపూర్లలో రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. షాద్‌నగర్ సమీపంలోని లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణంకు ఇప్పటి వరకు టెండర్లను పిలవలేదు. మొదట ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లాలోని భూములకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ముఖ్యమంత్రి సమీక్ష తరువాత ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటి ద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించి చేపడుతున్నారు. ఇప్పటి వరకు 18 ప్యాకేజీల పనులకు టెండర్లను పిలిచారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కింద మూడు ప్యాకేజీలు ఉన్నాయి. వీటికి టెండర్లు పిలవలేదు.
ఐదు రిజర్వాయర్లకు పరిమితం
————————————-
ఇక నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయి. కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు మాత్రం చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో రెండు గ్రామాలు పూర్తిగా ముంపుకు గురి అవుతున్నాయి. ఈ గ్రామాల ప్రజలు పరిహారం..పునరావాసం కొరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రిజర్వాయర్ పనులను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. 16 టిఎంసిల సామర్థ్యంతో ఉద్దండాపూర్ జలాశయంను నిర్మిస్తున్నారు.
అక్కడి నుంచే సాగునీరు
—————————–
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దండాపూర్ జలాశయం నుంచి జిల్లాలోని నాలుగు అసెంబ్లిd నియోజకవర్గాలకు సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఒక టిఎంసి నీటిని ఎత్తిపోసే పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్దండాపూర్ జలాశయం పనులు ఏమేరకు పూర్తి అవుతాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు కూడా ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. క్రితంఏడాది బడ్జెట్లో పాలమూరు ప్రాజెక్టుకు కేవలం రూ.368 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు కేటాయించారు. పాలమూరు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.52 వేల కోట్లకు చేరుకుంది. పంప్‌హౌస్‌ల నిర్మాణంకు పవర్ హౌసింగ్ కార్పోరేషన్ రూ.10 వేల కోట్ల రుణంను మంజూరు చేసింది. జలాశయం పనులకు ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తేనే ప్రాజెక్టు పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది.