మోమిన్ పేట. (ప్రభన్యూస్): బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలంలో నిన్న(సోమవారం) జరిగింది. కాగా, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఇవ్వాల (మంగళవారం) వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన గారేల గోవర్ధన్ (25) సోమవారం తన బైక్మీద బయటికి వెళ్లి వస్తానని చెప్పాడు. గ్రామ పరిధిలోని గారెల భీమయ్యకు చెందిన బావిలో గోవర్ధన్ ఈత నేర్చుకుందామని వెళ్లాడు.
అతనితోపాటు గ్రామస్తులు అభిలాష్, గారెల యాదయ్య కూడా వెళ్లి గోవర్ధన్ నడుముకి ప్లాస్టిక్ డబ్బా కట్టి ఈత నేర్చుకోవడానికి సహాయపడ్డారు. అయితే.. గోవర్దన్ బావిలో దూకినప్పుడే నడుముకు కట్టిన ప్లాస్టిక్ డబ్బా ఊడిపోయింది. దీంతో అతను నీటిలో మునిగిపోతుంటే అభిలాష్, యాదయ్య నీటిలోకి దూకి అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, గోవర్దన్తోపాటు అభిలాష్ (16) కూడా నీళ్లల్లో మునిగి చనిపోయాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్ ప్రకాష్ తెలిపారు. ఈత నేర్చుకుందామనే క్రమంలో చనిపోయాడు, కానీ, ఇతరత్రా కారణాలు లేవని.. తమ కుమారుల చావులో అనుమానం లేదని బాధిత కుటుంబ సభ్యులు చెప్పినట్టు ఎస్ఐ విజయ ప్రకాష్ తెలిపారు.