(ప్రభ న్యూస్ ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో స్కూల్ యూనిఫామ్ లను అందించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, మొయినాబాద్ చిలుకూరు గ్రామంలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.
ఈ కేంద్రంలో కొనసాగుతున్న యూనిఫామ్ ల తయారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని జతల యూనిఫామ్ లను సిద్ధం చేశారు, ఇంకా ఎన్ని జతలు కుట్టాల్సి ఉంది, క్లాత్ మెటీరియల్ అందుబాటులో ఉందా, ప్రతిరోజూ సగటున ఎన్ని యూనిఫామ్ లను తయారు చేస్తున్నారనే తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి ముందే యూనిఫామ్ లు ఆయా బడులకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ స్కూల్ యూనిఫామ్ లు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫామ్ లు కుట్టేలా పర్యవేక్షణ జరపాలని, నిర్దిష్ట గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. యూనిఫామ్ ల తయారీకి సంబంధించిన ప్రగతి నివేదికలను తనకు రోజువారీగా అందించాలని అధికారులను ఆదేశించారు.