వికారాబాద్ :రాష్ట్రంలో వ్యవసాయ క్రయవిక్రయాలకు పేరొందిన తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మరోసారి సత్తా చాటుకుంది. కరోనా మహమ్మారిలోనూ ఈ యార్డులో భారీగా వ్యాపారం జరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో యార్డులో దాదాపు రూ.391 కోట్ల మేరకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయి. తాండూరు మార్కెట్ యార్డు కందుల క్రయవిక్రయాలకు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. గడిచిన ఏడాదిలో తాండూరు యార్డులో భారీగా వ్యాపారం జరగడంలో కందులు..వరిధాన్యం ప్రధాన పాత్ర పోషించాయి. కరోనా కారణంగా నెలల తరబడి యార్డు మూతపడినా ఈ ఏడాది జనవరి నుంచి కందులు పెద్ద ఎత్తున యార్డుకు రావడంతో భారీగా క్రయవిక్రయాలు నమోదు అయ్యాయి.
గత ఏడాది మార్చి మాసంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి నెలల తరబడి లాక్‌డౌన్ విధించారు. ఆతరువాత కూడా పలు ఆంక్షలు పెట్టి వివిధ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. దీంతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించలేదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తరువాత మార్కెట్ యార్డులు తిరిగి తెరుచుకోవడం ప్రారంభమైంది. గత ఏడాది చివరి నుంచి యార్డులు తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసిన వరిధాన్యంను ప్రభుత్వమే నేరుగా గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేసింది. ఇక మిగిలిన పత్తి..కంది పంటలను రైతులు యార్డులకు తరలించారు.
జిల్లాలో తాండూరు, వికారాబాద్, పరిగి, కోడంగల్‌తో పాటు మండల కేంద్రాలలో మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ యార్డులో కందుల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. తాండూరు యార్డు నుంచి కందులు అనేక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. గత ఖరీఫ్‌లో భారీ వర్షాలు కురవడంతో పత్తి పంటకు నష్టం జరిగింది. కంది పంటకు మాత్రం వర్షాలు కలిసి వచ్చాయి. దీంతో భారీగా దిగుబడి వచ్చింది. తాండూరు యార్డుకు కందులు పోటెత్తుతున్నాయి. యార్డులో మద్దతు ధరను మించి కందులకు ధరలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.
గత మార్చి చివరి నాటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తాండూరు యార్డులో 1.17 లక్షల క్వింటాళ్ల కందులు, 1.79 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం, 4.79 క్వింటాళ్ల పత్తి క్రయవిక్రయాలు జరిగాయి. అదే సమయంలో 23,856 క్వింటాళ్ల పెసలు, 14,516 క్వింటాళ్ల మినుములు, 7,905 క్వింటాళ్ల వేరుశనగ క్రయవిక్రయాలు జరిగాయి. మొత్తంగా యార్డులో రూ.391 కోట్ల మేరకు వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయించారు. యార్డులలో జరిగే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై మార్కెటింగ్ శాఖ ఒక శాతం ఫీజును వసూలు చేస్తుంది. ఇందులో భాగంగా యార్డులో జరిగిన క్రయవిక్రయాలపై రూ.3.91 కోట్ల మేరకు యార్డుకు మార్కెట్ ఫీజు రూపంలో ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన మూడు సాగు చట్టాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టడంతో మార్కెట్ ఫీజును వసూలు చేయాల్సి వచ్చింది.
అభివృద్ధికి వినియోగిస్తాం: విఠల్‌నాయక్, చైర్మన్, తాండూరు మార్కెట్ కమిటి(11టిడిఆర్52)
——————————————————————————————
తాండూరు యార్డులో జరిగిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా సమకూరిన రూ.3.91 కోట్ల ఆదాయంను రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులను చేపట్టేందుకు వినియోగిస్తాం. కరోనా తీవ్రతలో కూడా తాండూరు యార్డులో భారీగా వ్యాపారం జరగడం వెనుక రైతులు..వ్యాపారుల సహకారం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం.