శంకర్‌పల్లి, ప్రభ న్యూస్ : ప్రభుత్వాల నిర్వాకాల వల్ల అనేక పాఠశాలలు మూతపడ్డాయి, విద్యార్థులు నానా అవస్థలు పడుతూ అనుబంధ గ్రామాలలో పాఠశాలలు ఎక్కడ ఉంటే అక్కడ చదువుకుంటున్నారు.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూర దృష్టితో మూత బడిన పాఠశాలలను తెరిపించాలని ఒక గొప్ప సంకల్పం తీసుకున్నారు.
మండల పరిధిలో అందుకు తగిన ఏర్పాట్లు విద్యాశాఖ అధికారులు చేపట్టడం లేదు.. మండల పరిధిలో మాసాని గుడా అనుబంధ గ్రామమైన కచ్చిరెడ్డి గుడలో ఒకప్పుడు పాఠశాల వెలుగు వెలిగింది. ప్రభుత్వ నిర్వాకాల వల్ల భవనమైతే మిగిలిపోయింది కానీ ప్రభుత్వ చేయూత లేకుండా పోయింది. గత 12 సంవత్సరాల క్రితం మూతపడిన లక్ష్మారెడ్డి గుడ పాఠశాలను ఏ విధంగా తెరిపించారో మా గ్రామంలో కూడా పాఠశాలను ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో పాఠశాలను ప్రారంభిస్తే మా పిల్లలను ఇక్కడ స్థానికంగా ఉండే పాఠశాలకే పంపిస్తామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. మా గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్ల తప్పని పరిస్థితులలో ప్రైవేటు పాఠశాలల వైపు ఆలోచన చేస్తున్నామని వారు ఆవేదనతో అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి ఉద్దేశాలను తూచా తప్పకుండా పాటించి స్థానికంగా కచ్చిరెడ్డి గుడా గ్రామంలో పాఠశాలను తిరిగి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను గ్రామస్తులు వేడు కుంటున్న పరిస్థితి మండల పరిధిలో నెలకొంది. స్థానిక ప్రజల కోరికను మన్నించి పాఠశాలను వీలైనంత తొందరగా ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.