ఒక్కో ఇంజక్షన్ ధర రూ.30 వేలు..
ప్రైవేటు ఆసుపత్రులలో దందా..
నిబంధనలకు విరుద్దంగా ఆరు డోసుల ఇంజక్షన్..
వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణ శూన్యం..
వికారాబాద్..ప్రభన్యూస్ ప్రతినిధి : కోవిడ్ వైరస్ సోకిన బాధితులకు రెమిడెసివిర్ ఇంజక్షన్ సంజీవనిలా మారిపోయింది. ఈ ఇంజక్షన్ కోసం దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఈ ఇంజక్షన్ సరఫరాను పెంచాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్పత్తిదారులను కోరుతున్నాయి. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాలలో రెమిడెసివిర్ ఇంజక్షన్ దొరక్క కోవిడ్ బాధితులు ప్రాణాలు వదులుతున్నారు. మరోవైపు ఈ ఇంజక్షన్ పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌లో అందుబాటులో ఉండడం గమనార్హం. అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అధిక ధరలకు వీటిని గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్‌లో రూ.30 వేలకు విక్రయం అవుతోంది.
రెమిడెసివిర్ ఇంజక్షన్ వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. కోవిడ్ వైరస్ సోకి ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు మాత్రమే రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆక్సిజన్‌పై ఉన్న కోవిడ్ బాధితులకు మొదటి రోజు 200 ఎంజి ఒక డోసు ఆతరువాత నాలుగు రోజుల పాటు 100 ఎంజి డోసు రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది. అయితే ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రం కోవిడ్ బాధితులకు ఆరు డోసుల రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇస్తున్నారు. అవసరం లేకపోయినా ఒక డోసు అధికంగా ఇస్తున్నారు. ఇక ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు మాత్రమే ఈ ఇంజక్షన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నా కోవిడ్‌తో ప్రైవేటు ఆసుపత్రిలో చేరుతున్న ప్రతిఒక్కరికి దీనిని ఇస్తున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులలో రెమిడెసివిర్ ఇంజక్షన్ విరివిగా లభిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా ప్రైవేటు ఆసుపత్రులలో రెమిడెసివిర్ ఇంజక్షన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్ బాధితులకు ఒక్కో రెమిడెసివిర్ ఇంజక్షన్ రూ.30 వేలకు విక్రయిస్తున్నారు. మొదట ఈ ఇంజక్షన్‌లు లేవని..బయట ఎక్కడైనా తెచ్చుకోవాలని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు సూచిస్తున్నారు. మీరే వాటిని తెప్పించాలని..ఎంత ఖర్చు అయినా భరిస్తామని బాధితులు చెప్పడంతో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు బ్లాక్ మార్కెట్‌లో రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలను చెబుతున్నారు. మరో మార్గం లేకపోవడంతో కోవిడ్ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులు చెప్పినంత ధరలను భరించాల్సి వస్తోంది. ఇలా ప్రైవేటు ఆసుపత్రులలో ఆరు డోసుల రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను కోవిడ్ బాధితులకు ఇస్తున్నారు. ఒక డోసు అవసరం లేకపోయినా ఇస్తున్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ తీసుకున్న ఒక్కో కోవిడ్ బాధితుడి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు రూ.1.80 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఖర్చు అదనం. మొత్తంగా ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్ బాధితుడి నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో రెమిడెసివిర్ ఇంజక్షన్ పేరుతో ఇతర ఇంజక్షన్‌లు ఇచ్చి వసూళ్ల దందాను కొనసాగిస్తున్నారు.జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం మొత్తం కోవిడ్‌ను అరికట్టే చర్యలలో నిమగ్నమైంది. దీంతో ప్రైవేటు ఆసుపత్రులలో ఏం జరుగుతోంది అనేదానిపై దృష్టి సారించడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ చికిత్స పేరుతో పెద్దఎత్తున కాసులు దండుకుంటున్నాయి.