షాద్ నగర్, అక్టోబర్ 31, (ప్రభ న్యూస్) : షాద్ నగర్ రాజకీయ సమీకరణాలు వేగవంతంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పర్యటన ఉండడంతో స్థానిక నాయకులు వారిని రప్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. దీంతో మొట్టమొదటిసారి జాతీయస్థాయి అగ్రనేత అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ అసెంబ్లీలో ప్రచారం చేయడానికి వస్తున్నారు. రేపు నవంబర్ ఒకటో తేదీన సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి పాదయాత్రగా రాబోతున్నారు. రాహుల్ గాంధీ రైల్వే స్టేషన్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా చౌరస్తాకు శంకర్ కోసం ప్రచారం చేస్తూ చేరుకుంటారు.
ఈ సందర్భంగా మెయిన్ రోడ్డులో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ స్వయంగా ప్రచారానికి వస్తుండడంతో పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలించే అంశం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకున్న ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ఉరకలేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇద్దరు జెడ్పీటీసీలు విశాల శ్రావణ్ రెడ్డి వెంకట్రామిరెడ్డి మైనార్టీ నాయకుడు ఖాన్, మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పార్టీలో చేరారు. ఇంకా పెద్ద ఎత్తున రేపు పార్టీలో మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. దీనికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ రాకతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలు లేకపోలేదు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్టు షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తెలిపారు.
రాహుల్ గాంధీ స్వయంగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకోసం ప్రచారానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పూర్తి షెడ్యూల్ ను మీడియా సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేస్తామని శంకర్ చెప్పారు. షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ అనుబంద విభాగాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, కిసాన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఫిషర్మెన్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు,మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ గ్రామాల నుండి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు.