షాద్ నగర్ (ప్రభన్యూస్): తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు.. దేనికి అరెస్టు చేస్తున్నారని అడిగితే చెప్పరు.. అక్రమంగా అరెస్టు చేసి, బలవంతంగా పోలీసులు లాక్కేళుతున్నారు.. ఇదేమి దౌర్జన్యం? అంటూ బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ కమ్మరి భూపాలాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని చౌదర్గూడ మండలం చిన్న ఎల్కిచర్లలో తెల్లవారుజామున భూపాలచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవ్వాల (బుధవారం) షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉండడంతో ముందస్తు చర్యగా పోలీసులు భూపాలచారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు భూపాల చారి ఇంట్లోకి ప్రవేశించి ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వద్ద అరెస్టు చేసే వారెంట్ ఉందా? లేకపోతే అరెస్టు చేసేందుకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు బలవంతంగా లాక్కెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోలీసులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, ప్రజల హక్కులను కాపాడకుండా అధికారంతో కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.