Friday, November 22, 2024

కొవిడ్‌ బాధితులకు భరోసా..

తాండూరు : కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులు వెక్కిరిస్తున్నా తాండూరు సర్కారు ఆసుపత్రిలోని వైద్య సేవలు బాధితులకు ఊరటనిస్తున్నాయి. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ప్రత్యేకంగా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి.. అవసరమైనన్ని బెడ్లను అందుబాటులో ఉంచారు. చికిత్స పొందుతున్న బాధితులకు శ్వాస ఇబ్బందులు ఏర్పడితే అందుబాటులో ఉంచిన ఆక్సీజన్‌తో ఆయువునిస్తూ సత్వర సేవలను అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితికి వచ్చిన రోగులను మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. అదేవిధంగా కరోనా పరీక్షలకు కిట్స్ ఇక్కట్లు నెలకొన్నా అరువు తెచ్చిన కిట్లతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా రక్కసిని రూపుమాపేందుకు జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సేవలను అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు 50 పడకలతో కూడిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్డులో 17 మంది బాధితులకు సేవలను అందిస్తున్నారు. ఇంకా ఎవరైనా వస్తే ఉండేందుకు బెడ్లను సిద్దంగా ఉంచారు. దీంతో పాటు అవసరానికి సరిపడా ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచుకున్నారు. ఇప్పటికే 75 సిలిండర్లు ఉండగా 20 సిలిండర్లు ఖాళీ అయ్యాయి. ఇంకా 55 సిలిండర్లు సిద్దంగా ఉన్నాయి. అవసరమైతే మరిన్ని సిలిండర్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆసుపత్రిలో కరోనా నిర్దారణ కోసం రాట్‌ కిట్ల కొరత ఏర్పడినప్పటికి ప్రజల తాకిడితో కిట్లను అరువు తెచ్చి నిర్దారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. స్వాంతన అందిస్తున్న వైద్య సేవలతో బాధితులు సర్కారు వైద్యంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement