సిఆర్ఐఎఫ్(CRIF) కింద రూ.62 కోట్లు మంజూరుకి సంబంధించి ఉత్తర్వుల కాపీని ఆ శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో వున్న చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి కి అందజేశారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మూడు రోడ్డు మార్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సిఆర్ఐఎఫ్ (సెంట్రల్ రోడ్డు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కింద నిధులను మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. సిఆర్ఐఎఫ్ కింద రూ.62 కోట్ల మంజూరుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ అవుతాయని నాలుగు రోజుల ముందట ఆయన తెలిపిన విషయం తెలిసిందే. ఈ దిశగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళ్ళిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోని రోడ్ల విషయమై, అలాగే కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో వున్న పలు అంశాలపై అక్కడి అధికారులతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతూ పాలోఅప్ చేసి ఎట్టకేలకు సాధించారు. వీటిలో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వికారాబాద్, కోడంగల్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 48.4 కి.మిల మూడు రోడ్లను సిఆర్ఐఎఫ్ కింద అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాండూరు నియోజకవర్గ పరిధిలోని తాండూరు నుంచి ధారూర్ వరకు 9 కిలోమీటర్లు (కిలోమీటరు రాయి 9 నుంచి 18 వరకు), కోడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్ల నుంచి నారాయణపేట్ రోడ్డు మార్గంను రెండు కిలోమీటర్లు (కిలోమీటరు రాయి 0 నుంచి 2 వరకు) విస్తరించి అభివృద్ధి చేసేందుకు సిఆర్ఐఎఫ్ కింద నిధులు మంజూరయ్యాయి. ఈ రెండు రోడ్డు మార్గాల్లో మొత్తం 11 కిలోమీటర్ల రోడ్డు మార్గంను విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.17 కోట్లు వచ్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని శంషాబాద్ నుంచి కొల్లపడకల రోడ్డును కిలోమీటరు రాయి 7 నుంచి 22 వరకు మొత్తం 14 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేసేందుకు రూ.15 కోట్లు, అదేవిధంగా కందుకూరు మండలంలోని ఆర్.సి.ఐ రోడ్డు నుండి రావిర్యాల, కొంగర్ కలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడ వెళ్లి, ఆకుల మైలారం గ్రామాల మీదుగా మీర్ ఖాన్ పేట్ వరకు 22.8 కి.మీల రోడ్ల విస్తరణ, మరమ్మతులకు రూ.30 కోట్ల నిధులు మంజూరైనవి. మొత్తంగా దాదాపు 48.4 కి.మీ ల మేరకు సిఆర్ఐఎఫ్ కింద మూడు రోడ్డు మార్గాల అభివృద్ధికి రూ.62 కోట్లు వచ్చాయి. ఎంపీ రంజిత్ రెడ్డి నిరంతర కృషి…. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి తన నియోజకవర్గంలోని ప్రాంత అభివృద్ధి కోసం పరితపించే ఆయన మంచి సేవాగుణం వల్లే ఇది సాధ్యమైందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ… ఎంపీ చొరవతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ రాబోతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..