తాండూరు రూరల్, ప్రభన్యూస్ : మందు మాత్రలు మింగి ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంభీకులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన తాండూరు మండలం జినుగుర్తిలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ పోలీసులు, బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
మండలంలోని జినుగుర్తి గ్రామానికి చెందిన కంబలి నర్సింలు, యాదమ్మ దంపతులకు ఓ కూతురు(16), కుమారుడు ఉన్నారు. నర్సింలు, యాదమ్మలకు మనస్పర్థలు రావడంతో 11 సంవత్సరాల క్రితం విడి విడిగా ఉంటున్నారు. నర్సింలు డీఎసీం డ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో జినుగుర్తిలో ఉన్నాడు. తల్లి యాదమ్మ ఆమె తల్లిగారి ఊరైన కోటబాస్పల్లిలో ఉంటోంది.
గత రెండు సంవత్సరాల క్రితం నర్సింలు తన ఇంటిని అదే గ్రామానికి చెందిన హీరాలాల్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. కొన్ని నెలలుగా హీరాలాల్ కుమారుడు, నర్సింలు కూతురు సన్నిహితంగా ఉంటున్నారు. విషయం తెలిసిన నర్సింలు ఇద్దరిని బెదిరించాడు. రెండు రోజుల క్రితం నర్సింలు హీరాలాల్ కుటుంబాన్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు. అప్పటి నుంచి నర్సింలు కూతురు తిండి మానేయడంతో ఆమెను మందలించాడు.
మనోవేధనకు గురైన కూతురు ఇవ్వాల (శనివారం) ఇంట్లో ఉన్న గుర్తుతెలియని మాత్రలను మింగింది. వాంతులు కావడంతో చిన్నమ్మ, బాబాయిలు గమనించి చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
విషయాన్ని తల్లికి, మామకు తెలిపారు. అయితే బాలిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే అని పుకార్లు వినిపించాయి. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి బాధిత కుటుంభీకులతో విచారణ చేపట్టి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.