Friday, November 22, 2024

చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి సబితారెడ్డి..

కందుకూరు మండలంలో ఒకే రోజు ఆరు లక్షల చేప పిల్లల పంపిణీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. కందుకూరు, రాచాలూరు, తిమ్మాపూర్ గ్రామాల్లోని చెరువుల్లో ఆరు లక్షల చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని కందుకూరులోని సోమదేవుని చెరువులో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులవృత్తుల వారికి పెద్ద పీట వేస్తూ ఆర్థికంగా ఎదగటానికి ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత తీయటంతో అవి జలకళ సంతరించుకున్నాయన్నారు.

గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధారపడే వాళ్ళం… కానీ నేడు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో మృత్స సంపద పెరిగింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 26,778 నీటి వనరుల్లో రూ.68ల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను వదులుతున్నామ‌న్నారు. రంగారెడ్డి జిల్లాలో కోటి 60 లక్షల చేప పిల్లలు నీటి వనరుల్లో వదిలే కార్యక్రమం చేపడుతున్నాన‌న్నారు. చేపల మార్కెటింగ్ కు ఔట్ లెట్లు, ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీల‌ర్ వాహనాలు అందిస్తున్న ప్రభుత్వమన్నారు. ఈ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేస్తున్నట్లు, సరఫరదారులు తీసుకొచ్చిన చేప పిల్లలను నిశితంగా పరిశీలించి సైజ్, నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, నిబంధనల ప్రకారం లేని చేప పిల్లలను తిరస్కరించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement