Tuesday, November 26, 2024

‘కేసీఆర్’ కి వినతిపత్రం అందజేసిన మంత్రి..ఎమ్మెల్యేలు..

వికారాబాద్ :‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నాలుగు రోజుల క్రితం కొందరు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అటు బెంగళూరు..ఇటు ముంబాయి జాతీయ రహదారులను కలిపే అంతర్‌రాష్ట్ర రహదారి (మహబూబ్‌నగర్‌..తాండూరు..మన్నెకెలి)ని అభివృద్ధి చేయాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిందని కావున ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ రహదారి అభివృద్ధిపై అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వగానే రోడ్డు అభివృద్ధి చెందినట్లు అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి గత నాలుగేళ్లుగా ఈ రహదారి అభివృద్ధి విషయంలో వినతిపత్రాల అందజేతకు మించి ఏమీ జరగడం లేదు.

మహబూబ్‌నగర్‌ శివారులోని భూత్పూర్‌ నుంచి కోస్గి, కోడంగల్‌, తాండూరు పట్టణాల మీదుగా కర్ణాటకలోని మన్నెకెలి వరకు ఉన్న అంతర్‌రాష్ట్ర అనుసంధాన రహదారిని అభివృద్ధి చేయాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. మొత్తం 96 కిలోమీటర్ల నిడివితో ఉన్న ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చింది. నాలుగేళ్ల క్రితమే ఈ రోడ్డును భారత్‌మాల పథకం కింద చేర్చింది. అప్పటి నుంచి ఈ రోడ్డు అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారత్‌మాల పథకం కింద ఎంపిక చేసిన అనేక రోడ్ల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది.

భారత్‌మాల పరియోజన పథకం కింద హైదరాబాద్‌ శివారులోని అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు ఉన్న 46 కిలోమీటర్ల రోడ్డును విస్తరించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. భూసేకరణకు నిధులను కూడా మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధికి ఒకసారి టెండరు నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఆతరువాత టెండర్లను వెనక్కు తీసుకుంది. ఇప్పటి వరకు భారత్‌మాల పరియోజన పథకం కింద ఎంపిక చేసిన ఈ రోడ్డు విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి ఈ రోడ్డును అభివృద్ది చేయాలని పార్లమెంటులో ప్రస్తావించారు..మంత్రిని కలిశారు..జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

ఇలాంటి పరిస్థితులలో భారత్‌మాల పరియోజన పథకం కింద భూత్పూర్‌ నుంచి మన్నెకెలి వరకు ఉన్న అంతర్‌రాష్ట్ర రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తామని నాలుగేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్‌)ను సిద్దం చేయలేదు. భూసేకరణ ఎంత చేయాలి..అందుకు సంబంధించి నోటిఫికేషన్‌ కూడా జారీ చేయలేదు. భూసేకరణ కొరకు నిధులను కూడా మంజూరు చేయలేదు. ఇలాంటి పరిస్థితులలో మంత్రి..ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే అంతర్‌రాష్ట్ర రహదారి నాలుగు వరుసల రహదారిగా అభివృద్ది జరిగినట్లు ప్రచారం జరగడం విచారకరం. ఈ రోడ్డు మార్గం అధ్వాన్నంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడం పక్కన పెట్టి ఉన్న రహదారిపై తారుపోసి అభివృద్ధి చేస్తే ప్రజలు..వాహనదారులు సంతోషిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement