ప్రభన్యూస్ ప్రతినిధి, వికారాబాద్ : పట్టణ ప్రాంతాలలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వస్తుండడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోంది. రద్దీగా ఉండే పట్టణాలు కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం అన్ని పట్టణాలలో ఈ కార్యక్రమం జోరుగా సాగుతోంది.
జిల్లాలో మొత్తం నాలుగు మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 99 వార్డులు ఉన్నాయి. సమీప గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు దాదాపు లక్ష వరకు ప్రజలు పట్టణాలకు వస్తున్నారు. బస్సులు..ఆటోలతో పాటు సొంత వాహనాలలో ప్రజలు పట్టణాలకు వచ్చివెళుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్ పట్టణాల్లోని అన్ని మార్కెట్లు నిత్యం ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే మార్కెట్స్ వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉండే మార్కెట్ల ద్వారా ప్రజలు వైరస్ బారిన పడుతున్నట్లు గుర్తించారు. ఇక్కడి నుంచి కరోనా వైరస్ గ్రామాలకు విస్తరిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో గ్రామాలలో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దీనిపై దృష్టి సారించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. దీంతో అన్ని మునిసిపాలిటీలలో గత వారం రోజులుగా విస్తృతంగా శానిటైజేషన్ కార్యక్రమం జరుగుతోంది. మునిసిపాలిటీలకు అవసరం అయిన సోడియం హైపోక్లోరైట్ ద్రావణంను అందుబాటులో ఉంచారు. ప్రతి మునిసిపాలిటీకి వార్డులను బట్టి ఈ ద్రావణంను పంపిణీ చేశారు. ప్రతి వార్డులో సోడియం హైపోక్లోరైట్ ద్రావణంను పిచికారి చేసి శానిటైజేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అదే సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మర పారిశుద్ధ్య పనులను కూడా చేపడుతున్నారు.
జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో వారం క్రితం ప్రారంభమైన శానిటైజేషన్ కార్యక్రమాన్ని స్థానిక మునిసిపల్ చైర్‌పర్సన్‌లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఎంపిక చేసిన వార్డులలో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో చేపట్టిన శానిటైజేషన్ డ్రైవ్‌ను మునిసిపల్ కమిషనర్లు విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రోజువారిగా పురపాలక శాఖ రాష్ట్ర సంచాలకులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో చేపట్టిన శానిటైజేషన్ కార్యక్రమంతో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు అని మునిసిపల్ అధికారులు పేర్కొంటున్నారు.