Thursday, November 21, 2024

పేదలపై ‘లక్కీ ..స్కీమ్’ల వల !

ప్రభన్యూస్‌ ప్రతినిధి, వికారాబాద్‌ : కరోనా దెబ్బకు పనులు లేక..ఉపాధి దొరక్క పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలసపోయిన కుటుంబాలు కోవిడ్‌ భయంతో ఇంటికి చేరుకున్నారు. మొత్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తితో పేదల బతుకులు చిన్నా భిన్నమయ్యాయి. ఇలాంటి తరుణంలోనే మాయగాళ్లు పేదలను దోపిడీ చేయడానికి పథకాలు రచించారు. అమాయక పేదలను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున లక్కీ స్కీమ్ లను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ స్కీమ్ లు అమలులో ఉన్నాయి. పట్టపగలే పేదలను మోసం చేస్తున్నా పోలీసు శాఖ ప్రేక్షకపాత్ర వహిస్తోంది. ఫిర్యాదులు వచ్చినా కూడా స్పందించకపోవడం గమనార్హం.

జిల్లాలోని తాండూరులో నెల రోజుల క్రితం పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఫ్రెండ్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో కొందరు వ్యక్తులు లక్కీ స్కీంను నడుపుతున్నారు. ఈ వ్యక్తులు అచ్చంగా మురికివాడలకు చెందిన పేదలపైనే దృష్టి సారించారు. ప్రతినెలా ఒక్కో సభ్యుడి రూ.వెయ్యి చెల్లించాలి. స్కీంలో మొత్తం 3 వేల మంది ఉన్నారు. మొత్తం 12 నెలల పాటు స్కీం నడుస్తుంది. అంటే ప్రతినెలా నిర్వాహకులు సభ్యుల నుంచి రూ.30 లక్షలు వసూలు చేస్తారు. ప్రతినెలా 15వ తేదీని లక్కీడ్రా ఉంటుంది. గరిష్టంగా ప్రతినెలా నిర్వాహకులు రూ.5 లక్షల వస్తువులను డ్రాలో ఉంచుతారు. స్కీంలో సభ్యులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోని ఏదైనా ఫంక్షన్‌ హాల్‌లో డ్రాను తీస్తారు. ఈ స్కీంను నిర్వహించే వారికి ప్రతినెలా రూ.25 లక్షలు మిగులుతున్నట్లు స్పష్టమవుతోంది. సకాలంలో స్కీం డబ్బులు చెల్లించని వారి పేర్లను డ్రాలో వేయబోమని నిర్వాహకులు పేర్కొనడంతో ప్రజలు డ్రా తేదీలోపు నేరుగా స్కీం కార్యాలయంకు వెళ్లి మరీ చెల్లిస్తున్నారు. 12 మాసాల తరువాత మిగిలిపోయిన సభ్యులకు సగం డబ్బు అంటే రూ.6 వేలు లేదా నిర్వాహకులు సూచించిన వస్తువులలో ఏటో ఒకటి ఇస్తామని పేర్కొంటున్నారు. ఈ స్కీంలను నిర్వహించే వ్యక్తులకు ప్రతినెలా రూ.10 లక్షల వరకు మిగులుతున్నాయి. ఏటా దాదాపు రూ.1.20 కోట్లు అర్జిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి స్కీంల నిర్వహణకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. కొందరు దొంగ రిజిస్ట్రేషన్‌ నెంబర్లు ముద్రించుకొని స్కీంలను నడుపుతున్నారు.

తాండూరులోని ఫ్రెండ్స్‌ ఎంటర్‌ప్రైజస్‌పై పోలీసులకు మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ సాజిద్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఎస్పీ నుంచి మొదలుకొని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వరకు అందరికి ఫిర్యాదు చేశారు. ఎవరు కూడా లక్కీస్కీంలపై స్పందించకపోవడం గమనార్హం. ఒక్క తాండూరు పట్టణంలోనే దాదాపు 24 లక్కీ స్కీంలను నడుపుతున్నారు. వీరంతా కూడా రకరకాల పేర్లతో స్కీంలను నడిపిస్తున్నారు. స్కీంలోని సభ్యుల నుంచి నిర్వాహకులు ప్రతినెలా రూ.500 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఈ స్కీంలు అన్ని కూడా పేదలు అధికంగా ఉండే ప్రాంతాలలో నడుస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసు శాఖ అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసి నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సి ఉంటుంది. అలాంటిది ఫిర్యాదు వచ్చినా కూడా చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంతో లక్కీ స్కీం నిర్వాహకులు మరింతగా రెచ్చిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement