- ఢిల్లీ నుండి నేరుగా శంకర్ పల్లికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి
- డీసీపీ శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడిన సబితమ్మ
శంకర్ పల్లి, నవంబర్ 19 (ప్రభ న్యూస్) : శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శీ రాధ బాలకృష్ణ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగిన నేపథ్యంలో మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంగళవారం వారిని పరామర్శించారు. ఈసందర్భంగా వారి కుటుంబ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆదివారం రాత్రి సుమారు 11గంటల సమయంలో ఇంట్లో కూతురి పెళ్లి సందర్భంగా మెహందీ ఫంక్షన్ అనంతరం బంగారం పెట్టడానికి వెళ్లగా.. అందులో ఉన్న సుమారు రెండు కిలోల బంగారం, 80తులాల వెండి ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని రాధ బాలక్రిష్ణలు సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.
హడావుడిలో 133తులాలు చోరీకి గురైనట్లు తెలిపారని, మొత్తం రెండు కిలోల వరకు బంగారం అపహరణకు గురైందని తెలిపారు. వారి నుండి వివరాలు పూర్తిగా తెలుసుకొని డీసీపీ శ్రీనివాస్ తో సబితా ఇంద్రారెడ్డి ఫోన్ లో మాట్లాడారు. ఈ చోరీని ప్రత్యేక కేసుగా పరిగణించి, బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.
బాలకృష్ణ కుటుంబం ఈ సంఘటనతో పూర్తిగా దుఃఖంలో మునిగిందని, పెళ్లి సమయంలో జరిగిన చోరీతో సర్వత్రా ఆందోళన నెలకొందన్నారు. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి కేసును ఛేదించాలని సూచించారు. పార్శీ రాధ బాలక్రిష్ణ కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. పెళ్లి కూతురుతో సహా బాలక్రిష్ణ తల్లిదండ్రులు పార్శీ సుదర్శన్ దంపతులను సబితమ్మ ఓదార్చారు. పెళ్లి వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.