తాండూరు రూరల్ : రోడ్డు పక్కనున్న రోడ్డు రోలర్‌ను ఎత్తుకెళ్లి పాత సామాగ్రి వ్యాపారికి విక్రయించారు ఘరానా చోరులు. ఈ సంఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తాండాలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గుండ్ల మడుగు తాండా సమీపంలో నర్సింహారెడ్డి అనే వ్యక్తి గత 5నెలల క్రితం బ్రిడ్జీ, రోడ్డు పనులను చేపట్టారు. ఈ పనులకు బిల్లులు రాకపోవడంతో పనుల కోసం ఉపయోగించిన రోడ్డు రోలర్‌ను అక్కడే వదిలేసి ఇతర ప్రాంతాల్లో చేపట్టే పనుల వద్దకు వెళ్లిపోయారు. తాజాగా రోలర్ అవసరం ఏర్పడడంతో కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న కోటేశ్వర్ అనే వ్యక్తిని పంపించారు. రోడ్డు రోలర్‌ను తీసుకెళ్లేందుకని డీసీఎంను తీసుకువచ్చారు.
తీరా అక్కడికి వెళ్లాక రోలర్ కనిపించకపోవడంతో అవాక్కయ్యాడు. స్థానికులను, పరిసర ప్రాంతాలను విచారించగా నాలుగైదు రోజుల క్రితం తాండూరు మండలంలోని జినుగుర్తి గ్రామానికి చెందిన షాబోద్దీన్ లారీలో రోలర్‌ను తీసుకెళ్లారని తెలిసింది. కోటేశ్వర్ షాబోద్దీన్ ను కలిసి నిలదీయగా కొందరు వ్యక్తులు కాంట్రాక్టర్ వద్ద రోడ్డు రోలర్ కొనుగోలు చేశామని చెప్పారని, దానిని తాండూరు పట్టణం శేష్ ప్రభ థియేటర్ సమీపంలోని పాత సామాగ్రి వ్యాపారి వద్ద వదిలేందుకు కిరాయి మాట్లాడడంతో తీసుకెళ్లానని వివరించారు. యజమాని కాంట్రాక్టర్ ఆదేశాలతో డ్రైవర్ కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రోడ్డు రోలర్‌ను విక్రయించిన వ్యాపారి వద్దకు వెళ్లి చూడగా అన్ని విప్పేసిన పార్టులతో కనిపించింది. రోడ్డు రోలర్ తమదే అని డ్రైవర్ గుర్తించి పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా విచారణ చేపట్టారు. రోడ్డు రోలర్ ను ఎత్తుకెళ్లిన వారు ఘరానా చోరులు అయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..