Friday, November 22, 2024

Vikarabad: రైతులకు రూ. 25వేల రుణమాఫీ చేయాలి… కిషన్ నాయక్

వికారాబాద్, జూన్ 19 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన విధంగా శివారెడ్డిపేట సొసైటీ పరిధిలో రైతులకు రూ.25 వేల రూపాయలు రుణమాఫీ కాలేదని, ఇందుకు సొసైటీ చైర్మన్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని శివారెడ్డిపేట సొసైటీ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి చెందిన గొరిగి నర్సింలు, కిష్టయ్య అనే అన్నదములు తమకు సంబంధించిన పట్టా పాస్ బుక్ తీసుకోవడానికి 16,000 చెల్లించాలని సిబ్బంది కొరగా ఈ విషయాన్ని కిషన్ నాయక్ తెలపడంతో ఆయన అప్పటికప్పుడు కార్యాలయానికి వచ్చి 25 వేల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని సిబ్బందితో ప్రశ్నించారు.

తమ తల్లి పేరు మీద 13 వేల రూపాయల రుణం ఉందని, మరో మూడు వేల రూపాయల వడ్డీ కలిపి 16 వేల రూపాయలు చెల్లించాలని సిబ్బంది సూచించారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది ఒకటని, రూ.25000లు రుణమాఫీ చేస్తామని, రైతులతో తిరిగి కట్టించుకోవడం ఎంతవరకు సమంజసమని కిషన్ నాయక్ ప్రశ్నించారు. సొసైటీ చైర్మన్ ముత్యంరెడ్డి అమాయకుడని, ఆయనను బలిపశువు చేస్తున్నారని కిషన్ నాయక్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో రైతులకు న్యాయం జరిగని పక్షంలో.. రైతులకు న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ ఎదుట రైతుల ఎడ్లబండ్లతో, ట్రాక్టర్లతో ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement