బొంరాస్ పేట్, ఆగస్ట్ 5 (ప్రభ న్యూస్) : ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని, బిందు సేద్యానికి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90శాతం రాయితీ అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొడంగల్ ఉద్యాన అధికారి వైజయంతి కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వికారాబాద్ జిల్లాలో ఆయిల్ ఫామ్ పెంపకానికి 3వేల ఎకరాలు లక్ష్యంగా నిర్దారించడం జరిగిందన్నారు. ఈ పథకానికి రైతులందరూ అర్హులే అని తెలిపారు.
ఒక మొక్కకు 20రూపాయల చొప్పున ఎకరానికి 1140 రూపాయలను అందిస్తుందన్నారు. ఎరువులు, అంతర పంటల కోసం మొదటి 4సంవత్సరాల్లో ఎకరానికి 4200 రూపాయలు ప్రోత్సహకంగా అందిస్తుందని ఆమె తెలిపారు. బిందు సేద్య పరికరాలకు ప్రభుత్వం రాయితీని అందిస్తుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు క్లస్టర్ ఉద్యాన అధికారి, లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు. దరఖాస్తు చేసుకునే రైతులు తమ పాస్ బుక్, ఆధార్, బ్యాక్ ఖాతా బుక్ జిరాక్స్ లను అందించాలని ఆమె కోరారు. ఇందుకు డిహెచ్ & ఎస్ఓ పై డిడి తీయవలసి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.