Thursday, September 12, 2024

TG | ఊరిని ముంచెత్తిన ఫిరంగి నాలా.. రంగనాథ్ సర్ జర చూడాలే..

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి ఫిరంగి నాలా శాపంలా మారింది.. ఈ కాలువ ద్వారా చెరువుల్లోకి చేరాల్సిన వరద నీరు దానికి అడ్డంగా నిర్మాణాలు చేపట్టడంతో గ్రామాలను ముంచెత్తుతోంది.. దీంతో ఉల్లోనీ ఇండ్లల్లోకి నీరు చేరి ఇబ్బందులు తప్పడం లేదని జన్వాడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

రియల్టర్లు చేసిన దుర్మార్గపు పనులకు సామాన్య జనం ఇబ్బంది పడాల్సి వస్తోంది.. అయితే ఈ విషయంలో నాలాకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి బిల్డర్లకు వంత పాడుతున్నారు. ఈ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలని జనం కోరుతున్నారు.

ఇక.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన్వాడ గ్రామంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరుతోంది. అయితే, వర్షపు నీటితో పాటు ఫిరంగి నాలాలోని మురుగునీరు కూడా ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ పరిస్థితిపై ఆంధ్రప్రభ పలు కథనాలు ప్రచురించినా అధికారుల్లో కొంచం కూడా కదలిక లేదు.

ఫిరంగినాలా ప్రవాహానికి అక్కడి రియల్టర్లు అడ్డంకులు సృష్టించారని… దీంతో ఫిరంగినాలాలోని మురుగు నీరు కాలనీల్లోకి ప్రవహిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అధికారులు దృష్టికి తీసుకెళ్లినా… రియల్టర్లకు వారు వత్తాసు ప‌లికి గ్రామానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

- Advertisement -

శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఫిరంగినాలాలోని మురుగునీటితో క‌లిసి వ‌ర‌ద నీరు ఇళ్లలోకి వచ్చి చేరిందని జన్వాడ గ్రామంలోని బాధిత కాలనీ వాసులు వాపోయారు. ఫిరంగి నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న కల్వర్టులను తొలగించాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ సంయుక్తంగా గ్రామంలో ఫిరంగినాలా సమస్యను పరిష్కరించాలని జన్వాడ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement