వికారాబాద్ : శరవేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంను పరిశోధనలకు జోడించేందుకు శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పరిశోధనల కొరకు డ్రోన్‌ల వినియోగం కొరకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డ్రోన్‌ల వినియోగంకు చేసుకున్న దరఖాస్తును పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఆమోదించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనలకు డ్రోన్‌లను వినియోగిస్తున్న మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయంగా దేశంలో ఖ్యాతి సంపాదించింది.
తెలంగాణలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు మూడు ప్రాంతాలలో ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణకు సంబంధించి జగిత్యాలలో..మధ్య తెలంగాణకు సంబంధించి వరంగల్‌లో..దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో ఉంది. వీటికి అనుబంధంగా దాదాపు 36 చోట్ల వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉన్నాయి. పంటల వారిగా పరిశోధన నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారు. ఉదాహరణకు తాండూరులో కంది పంటల పరిశోధన నిమిత్తం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాలు.. సరికొత్త యాజమాన్య విధానాలను..చీడపీడలను ఎదుర్కొనేందుకు కొత్త వంగడాలను రైతులకు పరిచయం చేశారు.
సాగులో డ్రోన్‌ల సందడి
మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున డ్రోన్‌ల వినియోగం జరుగుతోంది. ప్రైవేటు వ్యక్తులు.. సంస్థలు వ్యవసాయ అవసరాల నిమిత్తం డ్రోన్‌ల వినియోగంను ప్రారంభించారు. ఎలాంటి పరిశోధన లేకుండానే వ్యవసాయంలో డ్రోన్‌లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఎంత ఎత్తు నుంచి పంటలపై డ్రోన్‌లతో మందులను పిచికారి చేయాలి.. ఎంత మోతాదులో మందులను వినియోగించాలి..డ్రోన్‌లతో మందులు వాడితే ఆహార పంటలపై వాటి ప్రభావం ఎంత..దుష్ఫలితాలు ఏమేరకు ఉంటాయి.. పంట పొలాలలో రైతు నేస్తాలుగా ఉండే కొన్ని చీడపీడలపై డ్రోన్‌ల ప్రభావం ఎంత అనే విషయాలపై ఎలాంటి పరిశోదన లేకుండానే వినియోగం చేస్తున్నారు. వీటన్నింటిపై పరిశోధన చేసి డ్రోన్‌ల వినియోగంకు తగిన మార్గదర్శకాలను జారీ చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఇందులో భాగంగా డ్రోన్‌లతో పరిశోదన చేసేందుకు అనుమతి కోరింది. ఇందుకు కేంద్ర పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డిజిసిఏ) నుంచి అనుమతి వచ్చింది.
సమర్థ వినియోగంకు పరిశోధనలు
డ్రోన్‌ల వినియోగంకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు అనుమతి రావడంతో మొత్తం ఐదు పంటలపై డ్రోన్‌లను ప్రయోగించి పరిశోధన చేయాలని నిర్ణయించారు. వరి పంట పరిశోధనకు రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన స్థానంను.. వేరశనగ పంటలో పరిశోధన కొరకు పాలెంలోని ప్రాంతీయ పరిశోధన స్థానం..సోయా పంటలో పరిశోధన కొరకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధన కేంద్రం..కంది పంటలో పరిశోధన కొరకు తాండూరులోని పరిశోధన కేంద్రంను..పత్తి పంటలో పరిశోధన కొరకు వరంగల్ ప్రాతీయయ పరిశోధన కేంద్రంను ఎంపిక చేశారు. ఈ ఐదు కేంద్రాలలో ఆయా పంటలపై డ్రోన్‌లను ప్రయోగించి వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. ఈ పరిశోధనల అనంతరం వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను ఎలా వినియోగించాలి అనే దానికి సంబంధించి పంటల వారిగా మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
డ్రోన్‌ల వినియోగం పెరుగుతోంది: డాక్టర్ సుధాకర్, హెడ్, తాండూరు పరిశోధన స్థానం(8టిడిఆర్52)
రానున్న రోజులలో వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులు.. సంస్థలు డ్రోన్‌లను వినియోగించి వివిధ పంటలపై మందులను పిచికారి చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా వ్యవసాయ రంగంలో డ్రోన్‌లను వినియోగించేందుకు పరిశోధనలు అవసరం. డ్రోన్‌ల వాడకంపై పరిశోధనలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంకు చెందిన సంస్థ తమ విశ్వవిద్యాలయంకు అనుమతి ఇచ్చింది. రానున్న ఖరీఫ్(వానాకాలం) సీజన్ నుంచి పరిశోధనలు ప్రారంభం అవుతాయి.