శంకర్ పల్లి, ఆగస్టు 2 (ప్రభ న్యూస్) : జన్వాడ గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చడం కానీ, జిహెచ్ఎంసి లో కలపడం కానీ చేయనే చేయవద్దని గ్రామంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. గ్రామ సమస్యలను పరిష్కరించకుండా గ్రామ ప్రజలపైన భారం వేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్లు శుక్రవారం పెడతారనే సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వారు ఈ నిరసన ప్రక్రియకు పూనుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ… తమ గ్రామాన్ని మునిసిపాలిటీగా మార్చమని లేదా జిహెచ్ఎంసి లో కలపమని కానీ మేమేమైనా అడిగామా.. తాము అడిగిన తమ సమస్యలను పరిష్కరించండి అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. మొత్తం మీద శంకర్ పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో నిరసనల కార్యక్రమం ఉవ్వెత్తున ప్రారంభమైంది. గ్రామంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు వెంకటేష్, మాజీ వార్డ్ మెంబర్ అశోక్, నాగరాజు, అశోక్, తదితరులు ఉన్నారు.