Friday, November 22, 2024

ప్రజలను వెంబడిస్తున్న గ్రామసింహాలు..

వికారాబాద్‌ : జిల్లాలోని తాండూరు పట్టణంలో వేకువజామున ఐదు గంటల ప్రాంతంలో కొందరు మహిళలు ఉదయం నడక కొరకు ఇంటి నుంచి బయల్దేరారు. రోడ్డుపైకి వచ్చిన మహిళలకు ఒక వృద్ధుడు చేతిలో కర్ర పట్టుకొని కనిపించాడు. మహిళలను చూసిన వృద్ధుడు జాగ్రత్త చేతిలో కర్ర పట్టుకోండి లేదంటే వీధి కుక్కల వెంబడిస్తాయి అని సూచించాడు. అంతలోనే వీధి కుక్కల గుంపు రావడంతో మహిళలు బెదిరిపోవడం..పక్కనే ఉన్న వృద్ధుడు కుక్కల గుంపును చేతిలోని కర్ర సహాయంతో చెందరగొట్టారు.

తాండూరు మున్సిపాలిటీకి చెందిన టిఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు దాదాపు డజను మంది ఇటీవల ఇంఛార్జి కమిషనర్‌ అశోక్‌కుమార్‌ను కలిశారు. తాండూరులో వీధి కుక్కల బెడద అధికంగా ఉందని..వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఒక వినతిపత్రం అందించారు. ఈ రెండు ఘటనలతో తాండూరు పట్టణంలో వీధి కుక్కల సమస్య ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలోని ఒక్క తాండూరు పట్టణంలోనే కాదు మొత్తం నాలుగు మున్సిపాలిటీలలో ఇదే సమస్య ఉంది. వీధి కుక్కల నియంత్రణకు స్థానిక మునిసిపాలిటీలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వాటి సంతతి బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వీధి కుక్కలు ప్రజలను వెంబడిస్తున్నాయి. ఇళ్ల నుంచి పిల్లలు..పెద్దలు బయటకు వెళ్లాలి అంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలలో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ కుక్కల బెడద మరింత అధికంగా ఉంది. ప్రతిఏటా పట్టణ ప్రాంతాలలో వీధి కుక్కల సంతతి పెరిగిపోకుండా ఉండేందుకు మునిసిపాలిటీలు చర్యలు చేపడుతారు. అయితే జిల్లాలోని నాలుగు మునిసిపాలిటిలలో గత ఏడాదిన్నరగా వీధి కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చివరి సారిగా కొన్ని మునిసిపాలిటీలలో రెండేళ్లక్రితం వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు.

రెండు మునిసిపాలిటీలు కొత్తగా ఏర్పాటు కావడంతో పాటు అప్పటికే ఉన్న రెండు మునిసిపాలిటీల పరిధి పెరిగిపోవడంతో వీధి కుక్కల సంతతి రోజురోజుకు పెరిగిపోతోంది. మునిసిపాలిటీలు వీధి కుక్కల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో వాటి సంతతి బాగా పెరిగిపోయింది. ఒక్కో ప్రాంతంలో వందల సంఖ్యలో ఉంటున్న వీధి కుక్కలు పగలు..రాత్రి అక్కడి స్థానికులకు ఇబ్బందిగా మారాయి. రాత్రి వేళ తీవ్రమైన అరుపులతో స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఉదయం వేళ వీధి కుక్కలు రోడ్లపై వచ్చిన వారిని వెంబడిస్తున్నాయి. నిత్యం వీధి కుక్కల బారిన పడే బాధితులు స్థానిక ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో తీవ్రమైన వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు మునిసిపల్‌ అధికారులు దృష్టి సారించాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement