తాండూరు : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం, తాండూరు మండలం సరిహద్దుల్లో ప్రవహిస్తున్న కాగ్నానదిలో భార్య, భర్తలు గల్లంతయ్యారు. రెండు రోజుల తరువాత ఇద్దరి మృతదేహాలు కొట్టుకవచ్చిన సంఘటన ఈరోజు ఉదయం వెలుగు చూసింది. ఈ సంఘటన బషీరాబాద్ మండలం మంతటి – తాండూరు మండలం చంద్రవంచ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంతట్టి గ్రామానికి చెందిన నాటికేరీ బుగ్గప్ప, యాదమ్మలు భార్య భర్తలు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. వీరు మంతట్టి సమీపంలోని మూలగడ్డ వద్ద ఉన్న వ్యవసాయ పొలంలో కూరగాయలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుగ్గప్ప, యాదమ్మలు రాత్రి పగలు ఎక్కువగా పొలం వద్దే ఉండేవారు.
పొలంలో పండించిన కూరగాయలను కాగ్నావాగును దాటుకుంటూ వెళ్లి తాండూరు మండలం చంద్రవంచలో విక్రయించే వారు. ఈ క్రమంలో ఆదివారం బుగ్గప్ప, యాదమ్మలు చంద్రవంచకు వెళ్లారు. సోమవారం ఉదయం చంద్రవంచ నుంచి మంతట్టికి వాగుదాటేందుకు ప్రయత్నించారు. అదేరోజు వాగులోకి వరధనీరు ఉధృతంగా చేరింది. నీటి ప్రవాహాంలో వాగుదాటుతున్న బుగ్గప్ప, యాదమ్మలు వాగులో గల్లంతయ్యారు. తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్న కుమారుడికి వాగు సమీపంలో మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.