ఆంధ్రప్రభ, చేవెళ్ల: దళితనేత, సీనియర్ జర్నలిస్టు కడమంచి నారాయణదాసు దారుణ హత్యకు గురైయ్యాడు. గొడ్డలితో మెడనరికి హత్య చేశారు. హత్యచేసిన వ్యక్తి వరుసకు బావమర్ది అవుతాడని పోలీసులు తెలిపారు. చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కడమంచి నారాయణదాసు (48) కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా షాబాద్ మండలంలోని నాగర్ కుంట గ్రామంలో 16 ఎకరాల వివాదాస్పద భూమిని డీల్ చేసి ఈ భూమిని క్రయవిక్రయం కూడా చేశాడు. ఇందులో దాసుకు కొంతమేర లాభం వచ్చింది. ఈ సమయంలో వెంట అన్నివేళల తిరిగి మద్దతుగా చేవెళ్లకు చెందిన తూర్పాటి భాస్కర్(38) ఉన్నాడు. కాగా భాస్కర్ కు క్రయవిక్రయం పూర్తయిన తర్వాత ₹25లక్షలు ఇస్తానని నారాయణదాసు ఒప్పుకున్నాడు. నారాయణ దాస్‌కు భాస్కర్ వరుసకు బావమర్ది అవుతాడు. ఈ డీల్ పూర్తై కూడా రెండుమూడేళ్లు గడిచింది. ఇస్తానన్న డబ్బుల విషయంలో పలుమార్లు అడుగగా దాటవేస్తూ వచ్చాడు.
కాగా, మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఇంటినుంచి నారాయణదాసు, భాస్కర్ ఇద్దరు ఊరెళ్ల వద్దనున్న ఫాంహౌస్ వద్దకు వెళ్లివస్తామని భార్య మాణెమ్మకు చెప్పి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరు మద్యం తాగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య డబ్బుల లావాదేవి చర్చకు రాగా, ఇది గొడవకు దారితీసింది, తోపులాడుకున్నారు. అయితే.. నారాయణదాసును భాస్కర్ కాలుతో తన్నగా వెనక్కి పడిపోయి తిరిగి లేవలేదు. దాస్ స్పృహలోకి వచ్చి గొడవ విషయం బయటపెడితే తన ప్రాణానికి హాని ఉంటుందని భాస్కర్ భయాందోళనకు గురైయ్యాడు. ఫాంహౌస్లో అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకుని మెడపై మోదాడు. దీంతో నారాయణదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.
రాత్రి అయినా రాకపోవడంతో..
రాత్రి ఆలస్యం అయినా ఇంటికి ఇంకా తిరిగి రాకపోవడంతో నారాయణదాసు భార్య మాణమ్మ పలుమార్లు భర్తకు, వెంట వెళ్లిన భాస్కర్ కు ఫోన్లు చేసింది. ఫోన్ లిప్ట్ చేసిన భాస్కర్ ఇక్కడే పలువురితో బావ మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. మధ్యం మత్తు దిగాకా భయాందోళనకు భాస్కర్ గురైయ్యాడు. హత్యచేసిన విషయం అందిరికీ తెలుస్తుందని భావించి అర్థరాత్రి 1 గంటల ప్రాంతంలో చేవెళ్ల పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి నారాయణదాసును తాను హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లి చూసి నారాయణదాసు హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నా భర్త హత్యపై అనుమానాలున్నాయ్: భార్య మాణమ్మ
కడమంచి నారాయణదాసు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే భార్య, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే పంచనామ చేసిన తర్వాత చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. హత్యపై అనుమానులున్నాయని ఒక్కడే వాత్యచేసి ఉండడని, హత్యకు గల కారణాలు ఏమిటో తెలియాలని, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సీక్ నిపుణులు అందుబాటులో లేరని ఉస్మానియా ఆసుపత్రిలోనే శవ పరీక్ష నిర్వహించాలని మృతుడి భార్య డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు డెడ్‌బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, నారాయణదాసుకు ఇద్దరు కుమారులున్నారు. ఇందులో ఓ కుమారుడు ఎంబీబీఎస్, మరో కుమారుడు ఫిజియోథెరపి కోర్స్ చేస్తున్నాడు. భార్య మాణేమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
సీనియర్ జర్నలిస్టుగా, దళితనేతగా…
కడమంచి నారాయణదాస్ది నిరుపేద కుటుంబం. చదువు పూర్తి అయిన తర్వాత జర్నలిస్టుగా ఓ పదేళ్లు వివిధ దిన పత్రికల్లో పనిచేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ చేస్తూనే దళిత ఉద్యమనేతగా ఎదిగారు. దళితులపై ఎక్కడైన దాడులు జరిగితే వెంటనే స్పందించేవారు. అదేవిధంగా పలుగ్రామాల్లో అంబేద్కర్, జ్యోతిబాపూలే, సావిత్రీబాపూలే విగ్రహాలను కూడా పెట్టించారు. నారాయణదాసు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఉద్యమనేతలు దళిత రత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్, భీంరాజ్, రామస్వామి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పామెన భీం భరత్ దాస్ పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.