(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44 సంవత్సరాల అనుబంధానికి తెరపడనుంది. రంగారెడ్డి జిల్లాకు హెడ్ క్వాటర్ హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాల పునర్విభజన జరగడం పరిపాలనా సౌలభ్యం కోసం సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో రంగారెడ్డి జిల్లాకు హెడ్ క్వాటర్ దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన పాలన ఇకనుంచి జిల్లా కేంద్రంగా కొనసాగనుంది. సీఎం కేసీఅర్ చేతుల మీదుగా గురువారం రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది.
హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని 1978 సంవత్సరం ఆగస్ట్ 25వ తేదీన విడగొట్టారు. అప్పట్లో గ్రామీణ ప్రాంతంగా భావించిన ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తన మేనమామ కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. కొండా వెంకట రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఆయన రాష్టానికి ఎంతగానో సేవ చేశారు. విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవ ఎంతో గొప్పది.
44 యేళ్లు హైదరాబాద్ తో అనుబంధం..
44 యేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కేంద్రంగానే పరిపాలన కొనసాగింది. చుట్టూరా వంద కిలో మీటర్ల కు పైగానే రంగారెడ్డి జిల్లా విస్తరించి ఉంది. హైదరాబాద్ కేంద్రంగానే పాలన అందించారు. ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా హైదరాబాద్ లోనే ఉండటంతో ఇక్కడి నుండే పాలన అందించారు. చాలా కాలం తరువాత వికారాబాద్ ప్రాంతంలో కొన్ని కార్యాలయాలకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద హైదరాబాద్ జిల్లాతో 44 సంవత్స రాలు అనుబంధం ఉంది.
ఎట్ట కేలకు రంగారెడ్డి జిల్లాకు హెడ్ క్వా టర్..
చాలా సంవత్సరాల తరువాత రంగారెడ్డి జిల్లాకు హెడ్ క్వా టర్ ఏర్పాటు కానుంది. జిల్లా ఏర్పాటైన 44 సంవత్సరాల తరువాత జిల్లా కేంద్రం ఏర్పాటు కానుండటంతో హర్షించాల్సిన విషయం. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన పాలన జిల్లా కేంద్రంగా కొనసాగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించ నున్నారు. కొన్ని రోజుల తరువాత అన్ని కార్యాలయాలు కొంగర కలాన్ లో నిర్మించిన కలెక్టరేట్ నుండే పనిచేయనున్నాయి. భవనం ప్రారంభం కాగానే ఒకొక్క కార్యాలయాలు తరలి రానున్నాయి.
ఉమ్మడి రాష్ట్రం తోపాటు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రంగారెడ్డి జిల్లా గుండె కాయగా కొనసాగుతోంది. నాడు నేడు అధిక ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న జిల్లాగా పేరు గడించింది. హైదరాబాద్ జిల్లా చుట్టూ రా విస్తరించి ఉండటం శివారు ప్రాంతాలు పట్టానాలుగా ఆవిర్భవి స్తున్నాయి. దానికి తోడు రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుండటంతో ఎక్కువ ఆదాయం సమకూర్చుకున్న జిల్లాగా రికార్డ్ సృష్టిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ సిటీ ఏర్పాటు కావడం ఈ ప్రాంతం ఎంతగానో అభివృధి చెందింది. మొత్తం మీద ఆనాడు ఈనాడు రంగారెడ్డి జిల్లా ఆదాయాన్ని సమకూర్చే జిల్లా కొనసాగుతోంది.